టెట్రా ప్యాకెట్లలో మద్యం: ఆదాయం కోసం రేవంత్ యత్నం
ఈ క్రమంలోనే ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
By: Tupaki Desk | 14 April 2025 3:44 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి మించిన ఖర్చులు పెరిగాయి. అమలు చేయాల్సిన పథకాలు బారెడు ఉండగా.. వస్తున్న ఆదాయం.. మూరెడు కూడా లేకపోవడంతో నానా తిప్పలు పడుతున్నారు. ఇక, కేంద్రం నుంచి సహకారం.. నేతి బీరలో నెయ్యి ఎంతో ఉంటుందో ..ఖచ్చితంగా అంతే ఉంది. దీంతో ఇప్పుడు ఆదాయార్జన పై సర్కారు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మద్యాన్ని మించిన మహత్తర వనరు లేదని భావించిన సర్కారు.. దీనిని మరింత చేరువ చేసేందుకు.. ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా లోగుట్టుగా జరిగినా.. మీడియా పెరుమాళ్లు పట్టేసి.. బహిరంగం చేసేశాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు.. బాటిళ్లలో విక్రయించిన 180 ఎంఎల్ స్థానంలో ఇక నుంచి పెగ్గు మందును కూడా.. టెట్రా ప్యాకెట్లో విక్రయించనున్నారు. అదేవిధంగా 90 ఎంఎల్‌కు కూడా.. ఈ మహర్దశ పట్టింది. దీంతో మందు బాబు ఖుషీఅవుతున్నారు. దీనికి ఆ.. ఈ.. అనే మాటే లేకుండా.. అన్నిబ్రాండ్లకు అనుమతి ఇచ్చేశారు.
దీనిని తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో విక్రయాలు ప్రారంభించారు. ప్రభుత్వంతో మెక్‌డొవెల్స్ కంపెనీ మంతనాలు కూడా జరిపి.. మహబూబ్‌నగర్‌లో విక్రయాలకు 2 లక్షల 60 ఎంఎల్, లక్షకుపైగా 90 ఎం ఎల్ టెట్రాప్యాక్‌లను విక్రయానికి పంపించింది. ఇది సక్సెస్ అయితే.. తెలంగాణ అంతటా త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇక, ఇప్పటికే కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనూ ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు.
ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను 60 ఎంఎల్, 90 ఎంఎల్, 180 ఎంఎల్ ప్యాకెట్లను అమ్మడం ద్వారా.. బాటిల్ ఖర్చు కంపెనీకి తగ్గుతుండగా.. విక్రయాలు పెరిగి.. సర్కారుకు ఎక్సౌజ్ సుంకాల రూపంలో ఆదాయం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. సీసాల్లో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్ల ధర తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర రూ.120గా ఉండగా, టెట్రా ప్యాకెట్లలో అది రూ.100కే లభించే అవకాశం ఉంది. కానీ, ట్యాక్సులు మాత్రం తగ్గవు. సో.. ఇదోరకమైన ఆదాయ మార్గం.
