కాంగ్రెస్, బీజేపీ ఓకే.... బీఆర్ ఎస్ టార్గెట్టే తేలాలా?
ఈ రెండు పార్టీలు ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాయి. అది సాధిస్తాయా లేదా? అనేది పక్కన పెడితే.. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు అయితే సాగుతున్నాయి.
By: Tupaki Desk | 7 July 2025 2:00 AM ISTతెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీజేపీలు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి రెండు రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సాధికార సభలో మాట్లాడు తూ.. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు తమవేనని ప్రకటించారు. అంతేకాదు.. ఒక్కటి తగ్గినా.. తాను బాధ్యత వహిస్తానని అన్నారు. పరిపాలనను చూసి ప్రజలు తమకు అండగా ఉంటారని.. ఉన్నారని కూడా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం దక్కించుకుంటుందన్నారు.
సో.. కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల లక్ష్యంతో పనిచేయడం ఖాయమని తేలింది. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. రాష్ట్రంలో నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచందర్ రావు.. కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 100 సీట్లలో విజయం దక్కించుకుంటామని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు, చేస్తున్న పనులు తమను ప్రజలకు చేరువ చేశాయని.. పార్టీలో నాయకులు అందరూ కలసి కట్టుగా పనిచేస్తున్నారని.. కాబట్టి. తమకు ప్రజలు 100 సీట్లకు తగ్గకుండా.. విజయం అందిస్తారని అన్నారు.
ఈ రెండు పార్టీలు ఒక లక్ష్యం నిర్దేశించుకున్నాయి. అది సాధిస్తాయా లేదా? అనేది పక్కన పెడితే.. ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకుని ముందుకు అయితే సాగుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పరిస్థితి ఎలా ఉంది? అనేది ఆసక్తికర విషయం. బీఆర్ ఎస్ అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పరిస్థితి కనిపించడం లేదు.
కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ పార్టీ అని చెబుతున్నా.. తెలంగాణ తెచ్చింది తామేనని అంటున్నా.. నిర్దేశిత లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే.. బీఆర్ ఎస్ లో కనిపించడం లేదు. మరి ఆ పార్టీ ఆలోచన ఏంటి? ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.