Begin typing your search above and press return to search.

ఒకేరోజు.. 2చోట్ల.. కాటికి సైతం కలిసే ప్రయాణం

తెలంగాణలో ఒకే రోజున రెండు చోట్ల ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకున్నాయి. జీవితంలోనే కాదు.. మరణంలోనూ భాగస్వాములే అన్న వీరి జీవితాల్లోకి వెళ్లి చూస్తే..

By:  Tupaki Desk   |   15 April 2025 12:00 PM IST
ఒకేరోజు.. 2చోట్ల.. కాటికి సైతం కలిసే ప్రయాణం
X

భర్తను చంపే భార్య. జీవిత భాగస్వామిని దారుణంగా చంపేసే భర్త. ఇలాంటి వార్తలు ఈ మధ్యన ఎక్కువ అయిపోయాయి. కానీ.. బంధాలు.. అనుబంధాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే నాటి తరం నేటితరానికి కొత్త పాఠాలు నేర్పిస్తోంది. బంధం.. అనుబంధం తీపిని పంచుతోంది. సుదీర్ఘకాలం పాటు కలిసి ఉన్న భార్యాభర్తల్లో ఒకరు కాలం చేయటం.. అది తట్టుకోలేక భాగస్వామి ఊపిరి ఆగిపోవటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. తెలంగాణలో ఒకే రోజున రెండు చోట్ల ఇలాంటి అరుదైన ఘటనలు చోటు చేసుకున్నాయి. జీవితంలోనే కాదు.. మరణంలోనూ భాగస్వాములే అన్న వీరి జీవితాల్లోకి వెళ్లి చూస్తే..

అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు రూపంగా నిలిచే ఈ ఉదంతాల్లో ఒకటి నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంటే.. ఇంకొకటి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలానికి చెందిన శంకరయ్య (67).. లక్ష్మీ (57) ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు ఇరవై ఏళ్ల క్రితం వచ్చారు. శంకరయ్య ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తుండేవాడు. వారికి పిల్లలు కలగకపోవటంతో ఒక అబ్బాయిని పెంచుకుంటున్నారు. కొద్ది నెలలుగా గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న శంకరయ్య ఆదివారం గుండెపోటుతో మరణించారు. భర్త మరణాన్ని తట్టుకోలేని లక్ష్మి తీవ్రంగా రోదించారు. ఎంతగా ఓదార్చినా ఆమెను ఊరించటం ఎవరికి సాధ్యం కాలేదు. భర్త మ్రతదేహం పక్కనే ఆమె కుప్పకూలిపోవటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణం విడిచారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలానికి చెందిన యశోద.. హనుమారెడ్డిదంపతులది రైతు కుటుంబం. హనుమారెడ్డికి నెల రోజుల క్రితం చేయి విరిగింది. చికిత్స కోసం దంపతులు ఇద్దరు ఖమ్మంలో ఉన్న కొడుకు ఇంటికి వచ్చారు. ఆదివారం సాయంత్రం యశోదా ఇంట్లో కాలు జారి కిందపడ్డారు. ఆమె తల దర్వాజకు బలంగా తగలటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. భార్య తన కళ్ల ముందే విగతజీవిగా పడిపోవటాన్ని తట్టుకోలేని హనుమారెడ్డి (81) గుండెపోటుకు గురై కుప్పకూలారు. గంట వ్యవధిలో భార్యభర్తలు మరణించిన వైనం గ్రామంలో విషాద ఛాయల్ని నింపింది.