కాంగ్రెస్ లో మార్పులకు ముహూర్తం ఫిక్స్!
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ సీఎం నివాసానికి వచ్చి, రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
By: Tupaki Desk | 6 Jun 2025 8:31 PM ISTతెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో వేగంగా పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమీక్షల అనంతరం కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఇటీవల బీఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న మార్పులతో రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసేందుకు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. పార్టీలో సమూల మార్పులకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ సీఎం నివాసానికి వచ్చి, రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. గత పదిహేను రోజులుగా ఆమె టీపీసీసీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ, పార్టీ లోపలి పరిస్థితులను నిశితంగా సమీక్షించారు. నియోజకవర్గాల స్థాయిలో ఆధిపత్య పోరు, నేతల మధ్య విభేదాలు, సోషల్ మీడియా దౌర్భాగ్య స్థితి, ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన లేకపోవడం వంటి అనేక సమస్యలను మీనాక్షీ గమనించారు.
ఈ సమస్యలన్నింటినీ సీఎం రేవంత్‌తో చర్చించి, తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. ముఖ్యంగా జిల్లా స్థాయిలో కార్యకర్తలతో కలిసిన సమావేశాల్లో వచ్చిన ఫిర్యాదులు, సూచనలు ఈ చర్చల్లో ప్రాధాన్యత పొందాయి. ఇకపోతే, కొత్తగా పార్టీలోకి వచ్చిన నాయకుల కారణంగా పాత నేతలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలను కూడా సీరియస్‌గా పరిగణించారు. తమ మధ్య మాటల యుద్ధానికి చెక్ పెట్టేలా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిశ్చయించారు.
పార్టీని బలోపేతం చేయడానికి సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. టీపీసీసీ కార్యవర్గ విస్తరణ, నియోజకవర్గాల స్థాయిలో నేతల సమీక్షా సమావేశాలు, సోషల్ మీడియా శిక్షణా శిబిరాలు వంటి కీలక అంశాలపై త్వరలోనే ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. కొత్త నాయకత్వ నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్ అయిందనే ప్రచారం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్ర స్థాయిలో రాజకీయ వ్యూహాలను మెరుగుపరచే దిశగా ఈ చర్చలు సాగినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ సమావేశాలు పార్టీకి ఎనలేని ప్రోత్సాహాన్ని ఇస్తాయని భావిస్తున్నారు. ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని అందించి, రాబోయే ఎన్నికల్లో మరింత పటిష్టంగా నిలబడేందుకు దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
