టీ-కాంగ్రెస్‌లో 'నామినేటెడ్' రగడ.. ఇదీ రీజన్!
తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. కానీ, భర్తీనే కావడం లేదు. ఈ మాట ఎవరో చెప్పలేదు.
By: Tupaki Desk | 27 Jun 2025 9:00 PM ISTతెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవులు ఉన్నాయి. కానీ, భర్తీనే కావడం లేదు. ఈ మాట ఎవరో చెప్పలేదు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డే ఇటీవల చెప్పుకొచ్చారు. దీనికి కారణం కూడా వెల్లడించారు. మంత్రుల వల్లే.. ఇది సాధ్యం కావడం లేదన్నారు. మంత్రులకు తాను ఈ పదవులు భర్తీ చేయాలని చెప్పానని..కానీ, వారు ఇప్పటి వరకు ఎలాంటి లిస్టును తనకు ఇవ్వలేదని కూడా తెలిపారు. ఇలా ఎందుకు చేస్తున్నారని కూడా వారిని ప్రశ్నించారు. ఇలా చేస్తే.. క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా పుంజుకుంటుందని నిలదీశారు.
ఈ విషయంపై అంతర్గతంగా సీఎం రేవంత్ ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే.. వాస్తవానికి.. మంత్రులు మాత్రం తమ వారికి పదవులు వస్తాయంటే ఎందుకు కాదంటారు? ఎందుకు సిఫార్సు చేయ కుండా ఉంటారు? అనేది ప్రధాన ప్రశ్న. అయితే.. ఇక్కడే అసలు విషయం ఉంది. గత ఎన్నికలకు ముందు పలువురు పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి వచ్చారు. వారి వెంట కొందరు బీఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా వచ్చారు.
దీంతో ఇప్పుడు తమ వారిగా చలామణి అవుతున్న వారికి పదవులు ఇవ్వాలన్నది కొందరు మంత్రుల ప్రయత్నం. అయితే.. వీరికి నామినేటెడ్ పదవులు కట్టబెడితే.. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీతో అనుబం ధం ఉన్నవారు.. ఆ పార్టీతో కలిసి నడుస్తున్నవారు.. తీవ్ర యుద్ధానికి దిగే అవకాశం ఉంది. అలాగని వీరిని ప్రమోట్ చేస్తే.. తమను డామినేట్ చేసే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అంటే.. తమ వారికి ఇచ్చుకోవాలని ఉన్నా.. ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
అలాగని.. పార్టీలో ఉన్నవారికి ఇస్తే.. తమను డామినేట్ చేస్తారన్న చర్చ కూడా ఉంది. దీంతో నాటినేటెడ్ పదవుల వ్యవహారం.. మంత్రులకు కూడా ఇబ్బందిగానే మారింది. వాస్తవానికి ఆలయ అభివృద్ధ కమిటీలు వేయాల్సి ఉంది. వీటిలో కీలకమైన యాదగిరి గుట్ట వ్యవహారం కూడా ఉంది. అదేవిధంగా మార్కెట్ కమిటీల విషయం కూడా హాట్‌హాట్‌గానే ఉంది. టెంపుల్‌కమిటీల వ్యవహారం ఎలా ఉన్నా.. మార్కెట్ యార్డు చైర్మన్ కమిటీలకు మరింత ఎక్కువగా పోటీ ఉంది.
ఈ పదవుల కోసం కీలక నాయకులు పోటీలో ఉన్నారు. వీరిలో బీఆర్ ఎస్ నుంచి వచ్చిన వారేఎక్కువగా పోటీ పడుతున్నారు. ఎంతైనా ఇస్తామని కూడా అంటున్నారన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రు లు వీరి విషయాన్ని తేల్చుకోలేక పోతున్నారు. కానీ.. సీఎం మాత్రం ముందు మీరు లిస్టు ఇవ్వండి తర్వాతే నేను తేలుస్తానని అంటున్నారు. మరి ఇది ఎప్పటికి తెగుతుందో చూడాలి.
