టీ-కాంగ్రెస్‌లో 'తాంబూలాలిచ్చేశారు'!
తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వివాదానికి అగ్రనేతలు తాంబూలాలిచ్చేశారు. ఇక, తన్నుకోవడమే అన్నట్టుగా క్షేత్రస్థాయిలో సీనియర్లు, జూనియర్ల మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి.
By: Tupaki Desk | 5 July 2025 3:42 PM ISTతెలంగాణ కాంగ్రెస్‌లో మరో వివాదానికి అగ్రనేతలు తాంబూలాలిచ్చేశారు. ఇక, తన్నుకోవడమే అన్నట్టుగా క్షేత్రస్థాయిలో సీనియర్లు, జూనియర్ల మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి. వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సహా ఉన్నత స్థాయి నాయకులు.. నామినేటెడ్ పదవుల విషయంలో ఒక విధానం రూపొందించి తమ కు ఆనందం కలిగిస్తారని..స్థానిక నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ బాధ్యతను అప్పగించి నా.. ఇప్పటి వరకు మంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు.
దీంతో కనీసం ఇప్పటికైనా.. పెద్దలు జోక్యం చేసుకుని ఒక విధానం ప్రకటిస్తారని నాయకులు భావించారు. కానీ, నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోపాటు.. ఇప్పటి వరకు ఎందుకు నియామకాలు జరగలేదని కూడా.. ఖర్గే, వేణుగోపాల్ సహా ఇతర నాయకులు ప్రశ్నించారు. దీంతో వెంటనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సూచించారు. ఈ క్రమంలో పదవుల పందేరానికి సోమవారం నుంచి క్రతువు ప్రారంభం కానుంది. అయితే.. ఇదే ఇప్పుడు మరోచిక్కు తీసుకువచ్చింది.
ఇప్పటి వరకు.. సీనియర్లు.. జూనియర్లు.. అనే క్రమంలో కొందరిని ఎంపిక చేసేవారు. కానీ.. ఖర్గే మాత్రం అందరూ సమానులేనని.. ఎవరు బాగా పనిచేస్తే వారికి పదవులు ఇవ్వడం తప్పుకాదన్నారు. ఇది.. సీనియర్లకు సుతరామూ నచ్చడం లేదు. పైగా గత ఎన్నికల్లోనూ.. తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో సీనియర్ల నుంచి నామినెటెడ్ పదవుల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది.
ప్రస్తుతం దేవాలయాలు, మార్కెట్ యార్డు చైర్మన్ పదవుల కోసం నాయకులు ఎదురు చూస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా మంత్రులు ఈ పదవులకు ఎవరినీ ఎంపిక చేయలేదు. దీనికి కారణం.. సీనియర్, జూనియర్ రచ్చే. అయితే.. ఇప్పుడు ఖర్గే అందరూ సమానులేనని చెప్పినా.. సీనియర్ల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. అలాగని జూనియర్లను పక్కన పెడితే.. మరో ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, ఖాజీ పేట వంటి మార్కెట్ యార్డు పోస్టులకు భారీ డిమాండ్ ఉండడం గమనార్హం.
