జానారెడ్డి ధ్రుతరాష్ట్రుడు.. : కోమటిరెడ్డి ఆగ్రహం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు తీవ్రస్థాయిలో రేగింది. మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం.. కొన్నా ళ్లుగా చర్చకు వస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 14 April 2025 9:42 AM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల చిచ్చు తీవ్రస్థాయిలో రేగింది. మంత్రి వర్గ విస్తరణ వ్యవహారం.. కొన్నా ళ్లుగా చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. రేపో మాపో.. అంటూ దీనిపై కాలయాపన కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి ఈ నెల 3న మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఎందుకో వాయిదా పడింది. అయితే.. కొందరు కావాలనే అధిష్టానానికి ఫిర్యాదులు చేసి.. మంత్రి వర్గ విస్తరణను అడ్డుకుంటున్నారని నాయకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా మునుగోడు ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మంత్రి వర్గ విస్తరణ అంశంపై హాట్ హాట్‌గా విరుచుకుపడ్డారు. మంత్రి వర్గ విస్తరణకు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి అడ్డు పడుతున్నారని అన్నారు. ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌లో ధ్రుతరాష్డ్రుడి పాత్ర పోషిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అధిష్టానం పచ్చ జెండా ఊపినా.. ఇలాంటి ధ్రుతరాస్ట్రుల కారణంగా వాయిదా పడుతోందని చెప్పుకొచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం.. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికిహాజరైన కోటమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. జానా కేంద్రంగా నిప్పులు చెరిగారు. తనకు మంత్రి పదవి రాకుండా.. జానా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ‘‘జానారెడ్డివంటి వారు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారు. నేను అడుక్కొనే స్థితిలో ఎప్పుడూ ఉండను.`` అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీ కోసం తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. సొంత సొమ్మును కూడా ధారపోశానని.. పార్టీని నిలబెట్టానని చెప్పుకొచ్చారు.
తన కృషి, కష్టాన్ని గుర్తించే అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదన్న ఆయన జానా రెడ్డి ధ్రుతరాష్ట్రుని పాత్ర పోషించకపోతే.. విస్తరణ ఎప్పుడో జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. జానారెడ్డి 30 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించారని.. కానీ, ఆయనకు ఇప్పుడు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులకు పదవులు కావాలని గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. కాగా.. ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో ఉన్న బలహీనతను, సమన్వయ లోపాన్ని మరోసారి ఎత్తి చూపిందని పరిశీలకులు చెబుతున్నారు.
