కాంగ్రెస్‌లో క్యాబినెట్ విస్తరణ కుంపటి.. తాజా అప్డేట్ !
నలుగురు కాంగ్రెస్ పార్టీసీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. అక్కడే తేల్చుకుంటాం అని కూడా వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 30 May 2025 3:00 AM ISTతెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో తాజాగామరో వివాదం తెరమీదికి వచ్చింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్‌ను విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమకు పదవి కావాలంటే.. తమ కు కావాలంటూ.. నాయకులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ఇప్పటికే ప్రయత్నాలు చేసుకోగా.. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు.. ఏకంగా ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం మొదలు పెట్టారు. పైగా .. వీరు నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనే భేటీ అవుతున్నారు.
ఇప్పటి వరకు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాన్చుడు ధోరణినే అవలంభిస్తోంది. తాజాగా రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. నేరుగా కాంగ్రెస్ పార్ట అగ్రనేత రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే క్యాబినెట్ విస్తరణకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా గురువారం పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నాయకులతో భేటీ అయ్యారు. దాదాపు మంత్రి వర్గ విస్తరణపైనే ఆమె కూడా దృష్టి పెట్టారు. ఇంతలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది.
నలుగురు కాంగ్రెస్ పార్టీసీనియర్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. అక్కడే తేల్చుకుంటాం అని కూడా వ్యాఖ్యానించారు. వీరిలో అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, సత్యనారాయణ, లక్ష్మీ కాంతారావుఉన్నారు. వీరంతా కూడా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు. కేబినెట్ విస్తరణలో మాదిగలకు స్థానం కల్పించాలని వీరు కొన్నాళ్లుగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. వీరు అనుకున్నట్టుగా సంకేతాలు రావడం లేదు.
పైగా ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు దక్కనుందన్న సమాచారం మరింత గడబిడకు గురిచేసింది. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. మరి పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చిత్రం ఏంటంటే.. తమకు అవకాశం ఇవ్వకపోతే.. పరిణామాలు వేరేగా ఉంటాయని తమ అనుచరులతో వీరు వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
