Begin typing your search above and press return to search.

మంత్రి పొంగులేటికి ఇచ్చిపడేసిన జీవన్ రెడ్డి

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అంటేనే సీనియర్లు, జూనియర్ల మధ్య నిత్యం ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువు.

By:  Tupaki Desk   |   17 May 2025 2:03 PM IST
మంత్రి పొంగులేటికి ఇచ్చిపడేసిన జీవన్ రెడ్డి
X

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ అంటేనే సీనియర్లు, జూనియర్ల మధ్య నిత్యం ఆధిపత్య పోరు, అంతర్గత విభేదాలకు కేంద్ర బిందువు. ఈ తరహా పరిణామాలు కొన్నిసార్లు పార్టీకి పెద్దగా నష్టం చేయకపోయినా, కీలక నేతలకు మాత్రం ఊహించని ఇబ్బందులను సృష్టిస్తుంటాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. జగిత్యాల వేదికగా జరిగిన ఒక సంఘటన కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి స్వరాలను మరోసారి హైలైట్ చేసింది.

శుక్రవారం జగిత్యాలకు వచ్చిన రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన అసంతృప్తిని బాహాటంగా ప్రదర్శించారు. కొంతకాలంగా పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న భావనతో జీవన్ రెడ్డి ఉన్నారని అందరికీ తెలిసిందే. ఆయన తన అసంతృప్తిని ఎప్పటికప్పుడు పరోక్షంగానో, ప్రత్యక్షంగానో వెలిబుచ్చుతూనే ఉన్నారు. తాజాగా పొంగులేటి పర్యటన సందర్భంగా ఇది పరాకాష్టకు చేరింది.

జగిత్యాలకు చేరుకున్న పొంగులేటి, సీనియర్ నాయకుడైన జీవన్ రెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేందుకు ముందుకు వెళ్లారు. అయితే, పొంగులేటి కౌగిలించుకునే ప్రయత్నం చేయగా, జీవన్ రెడ్డి వెనక్కి తగ్గి నమస్కారం పెట్టారు. ఈ ఊహించని పరిణామంతో పొంగులేటి ఒక్కసారిగా షాక్ అయ్యారు. పక్కనే ఉన్న యువ నాయకుల వైపు చూస్తూ, 'ఇదేం పద్ధతి బాసూ' అన్నట్టుగా సైగలు చేశారు.

ఈ క్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, "మాకు ఒక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేస్తే చాలు" అని అన్నారు. దీనికి స్పందనగా పొంగులేటి నమస్కారం పెట్టి మౌనంగా ఉండిపోయారు. అక్కడితో ఆగకుండా జీవన్ రెడ్డి.. పొంగులేటిని మరింత ఉడికిస్తూ "అంతే కదా బాబూ" అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యకు పొంగులేటి నవ్వలేక నవ్వుతూ మరోమారు నమస్కారం పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

పొంగులేటి వెళ్లిపోయిన తర్వాత, జీవన్ రెడ్డి అక్కడ ఉన్నవారితో మాట్లాడుతూ, "ఇక మీరు చూసుకోండి.. మా పని అయిపోయింది. ఇక రాజ్యం ఏలండి" అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీవన్ రెడ్డి ప్రదర్శించిన ఈ నిరసన వైఖరి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి స్పష్టం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియారిటీకి, కొత్త నాయకత్వానికి మధ్య సమన్వయం లోపించడం పార్టీకి దీర్ఘకాలంలో నష్టం కలిగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన కాంగ్రెస్ నాయకత్వానికి ఒక హెచ్చరిక అని, ఇలాంటి అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తుందని అంటున్నారు.