వారితో డిన్నర్ మీటింగ్ ఎందుకు పెట్టలేదు: మహేష్‌గౌడ్‌కు అధిష్టానం ప్రశ్న
ముఖ్యంగా పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవాలని తాను పదే పదే చెబుతున్నా.. ఆదిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని అన్నారు.
By: Garuda Media | 19 March 2026 9:11 AM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మహేష్‌గౌడ్‌కు పార్టీ అధిష్టానం గట్టిగానే క్లాస్ ఇచ్చినట్టు తెలిసింది. తాజాగా ఆయనను మార్చా ల్సిందేనంటూ.. ఇద్దరు మంత్రులు చేసిన వ్యాఖ్యలు.. దీనికి మరో మంత్రి మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మహేష్‌కుమార్ గౌడ్ పార్టీ అధిష్టానంతో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. గౌడ్‌కు ఏఐసీసీ నాయకులు గట్టిగానే కొన్ని విషయాలు చెప్పినట్టు తెలిసింది.
సీఎం రేవంత్ సహా.. మహేష్‌కుమార్ ఇద్దరూ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యారు. తొలుత క్షేమ సమాచారాలు తెలుసుకున్న అనంతరం.. ప్రియాంక గాంధీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. అనంతరం.. రాహుల్‌గాంధీ.. తనకు వచ్చిన సమాచారాన్ని సీఎం రేవంత్, మహేష్‌కుమార్‌లకు చూపించారు. పార్టీ సీనియర్ల నుంచి తనకు నేరుగా ఫిర్యాదు లు అందాయని ఆయన చెప్పడంతో గౌడ్ ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. పార్టీలో సఖ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆది నుంచి చెబుతున్నా.. ఆదిశగా ఎందుకు కార్యాచరణ చేయడం లేదని రాహుల్‌గట్టిగానే ప్రశ్నించారని సమాచారం.
ముఖ్యంగా పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవాలని తాను పదే పదే చెబుతున్నా.. ఆదిశగా ఎందుకు అడుగులు వేయడం లేదని అన్నారు. ప్రధానంగా పార్టీ సీనియర్ నాయకుడు.. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విషయాన్ని తనకు కొందరు మెయిల్ చేశారని కూడా రాహుల్ పేర్కొన్నట్టు తెలిసింది. తన తండ్రి కాలం నుంచి కూడా ఆయన పార్టీలో ఉన్నారని.. నిబద్ధతతో పనిచేస్తున్న అలాంటి వారిని వదులుకుంటే నష్టం కాదా?.. అని ప్రశ్నించినట్టు తెలిసింది. అయితే..జీవన్‌రెడ్డికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం ఇస్తున్నామని.. కానీ ఆయనే బీఆర్ ఎస్ ఆకర్షణలకు లోనవుతున్నారని గౌడ్ ఈ సందర్భంగావివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈ వివరణను తోసిపుచ్చిన రాహుల్ గాంధీ.. ఇలాంటివి చాలానే ఉన్నాయన్నారు. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యా క.. ఆయా టికెట్లు ఆశించిన సీనియర్లతో డిన్నర్ పార్టీ ఏర్పాటు చేసి.. చర్చించాలని చెప్పామని.. ఇతర రాష్ట్రాల్లో ఇవి జరిగాయ ని.. తెలంగాణలో ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించినట్టు తెలిసింది. అందరూ సీనియర్లేనని.. వారిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండాలని గట్టిగా చెప్పారని సమాచారం. పార్టీ పాలన ఎంత బాగున్నా.. సీనియర్లు.. జూనియర్ల మధ్య సంధానం(కనెక్టివిటీ) సరిగా లేకపోతే.. ప్రమాదమని చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
