Begin typing your search above and press return to search.

రేవంత్ కేబినెట్లో చోటు- ఇప్పట్లో కాదు గురూ !

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రస్తుతం కంఫర్ట్ జోన్ లో ఉంది. వరసబెట్టి విజయాలు ఆ పార్టీ అందుకుంటోంది.

By:  Satya P   |   27 Feb 2026 2:00 PM IST
రేవంత్ కేబినెట్లో చోటు- ఇప్పట్లో కాదు గురూ !
X

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రస్తుతం కంఫర్ట్ జోన్ లో ఉంది. వరసబెట్టి విజయాలు ఆ పార్టీ అందుకుంటోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలెడితే మునిసిపల్ ఎన్నికల్లో సైతం అత్యధిక స్థానాలు దక్కించుకుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఢంకా భజాయించింది. అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ జెండా ఎగిరింది. రెండేళ్ళకు పైదాటినా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ముందుకు సాగుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన నాయకత్వాన్ని బలంగా రుజువు చేసుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అనే మాహా సముద్రంలో అసంతృప్తి అసమ్మతి అన్నవి కవల పిల్లలు అని వర్గ పోరు వాటికి వేదిక అని అంతా అంటారు, అది సహజం కూడా. కానీ తెలంగాణా కాంగ్రెస్ లో అయితే ఇపుడు ఆ పరిస్థితి అంతగా లేదు అనే చెప్పాలి. అసంతృప్తి ఆ పాటిది ఉండడం అన్నది సహజం అని కూడా అంటున్నారు.

మోజు పడుతున్నారు అంతా :

ఇదిలా ఉంటే మంత్రి వర్గంలో చోటు కోసం అంతా మోజు పడుతున్నారు. ఆశావహుల సంఖ్య చూస్తే చాలా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో రెండు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేళ అనివార్యంగా అజారుద్దీన్ ని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అంతకు ముందు ముగ్గురుకి మంత్రి పదవులు ఇచ్చారు. అలా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి మంత్రులు అయ్యారు. వీరిని ఆయా జిల్లాలలో సామాజిక రాజకీయ ప్రాంతీయ సమతూకాలు అన్నీ చూసి మరీ ఎంపిక చేశారు.

కోమటిరెడ్డి డిమాండ్ :

ఇదిలా ఉంటే నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మునిసిపల్ ఎన్నికల్లో విజయం అననతరం నిర్వహించిన ర్యాలీలో తాను అయితే మంత్రి అవుతాను లేదా నేరుగా ముఖ్యమంత్రిని అవుతాను అని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారు అని పదే పదే గుర్తు చేస్తున్నారు. ఆయనతో పాటు ఇంకా రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేక మంది పోటీలో ఉన్నారు. ఇతర సామాజిక వర్గాల నుంచి ఆశలు పెంచుకున్న వారు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. ఉన్నవి చూస్తే రెండే ఖాళీలు అని గుర్తు చేస్తున్నారు.

పునర్ వ్యవస్థీకరణతో :

అయితే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పై దాటింది కాబట్టి పునర్ వ్యవస్థీకరణ చేసి ఎక్కువ మందికే చోటు కల్పిస్తారు అని ఆ మధ్య దాకా ప్రచారం సాగింది. అంటే ఉన్న మంత్రులలో కొందరికి ఉధ్వాసన అన్న మాట. అలా అవుట్ కొంతమంది ఇన్ మరి కొంతమంది అని కూడా చెప్పుకున్నారు. అయితే అది కూడా ఇప్పట్లో కాదని అంటున్నారు. ఎందుకంటే పునర్ వ్యవస్థీకరణ అంటే అతి పెద్ద తలనొప్పి వ్యవహారం అని అంటున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా అసంతృప్తులు పెరిగిపోతాయని అని అంటున్నారు.

మరి కొంతకాలం అలాగే :

దీంతో హైకమాండ్ అయితే తెలంగాణా కాంగ్రెస్ పెద్దలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంలేదని అంటున్నారు. మంత్రి వర్గాన్ని విస్తరించాలనుకుంటే ఇపుడు కాదనే మాట వినిపిస్తోంది. ఇంకా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ముందు ఉన్నాయి. వాటిని కూడా నిర్వహించిన తరువాత అపుడు ఏమైనా ఆమోదం తెలపవచ్చు అని అంటున్నారు. అప్పటికి సరిగ్గా సగం పాలన ముగుస్తుంది కాబట్టి ఎన్నికల టీం గా కూడా ఎంచుకుంటారని అంటున్నారు. అయితే ఎపుడు మంత్రి వర్గ విస్తరణ అయినా తేనె తుట్టెను కదపడమే అని అంటున్నారు. చాకచక్యంగా జాగ్రత్తగానే ఈ కూర్పు ఉండొచ్చు అని అంటున్నారు మొత్తానికి ఇప్పట్లో అయితే నో చాన్స్ అన్నది వినిపిస్తోంది. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో.