Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రివర్గం.. కొత్తగా ఎవరికీ చాన్స్ లేదు.. తేల్చేసిన ఖర్గే

దాదాపు ఏడాదిన్నర అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి... మొన్నటికి ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది.

By:  Tupaki Desk   |   4 July 2025 2:27 PM IST
తెలంగాణ మంత్రివర్గం.. కొత్తగా ఎవరికీ చాన్స్ లేదు.. తేల్చేసిన ఖర్గే
X

దాదాపు ఏడాదిన్నర అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి... మొన్నటికి ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. కేవలం ముగ్గురికి మాత్రమే చోటు దక్కింది. ఇంకా హైదరాబాద్, రంగారెడ్డి వంటి ప్రముఖ జిల్లాలకే కాదు.. నిజామాబాద్ జిల్లాకూ మంత్రి లేరు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు మాత్రం సీఎంతో పాటు ఇద్దరు మంత్రులు ఉన్నారు. తెలంగాణ క్యాబినెట్ లో ఇంకా మూడు ఖాళీలు ఉన్నాయి. మరి వీటిని భర్తీ చేసేది ఎప్పుడు..? మిగతా మూడు జిల్లాలకు అవకాశం దక్కేది ఎప్పుడు..? అలాగని ప్రతిసారీ ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానాన్ని కలిసే అవకాశం ఉండదు. ఆ అధిష్ఠానమే హైదరాబాద్ కు వస్తే.. ఇంకేముంది.. మంత్రి పదవులు ఆశిస్తున్న నాయకులంతా ఆయన ముందు క్యూ కట్టారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యనేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. తాజా పరిణామాలను తెలుసుకుంటూనే పార్టీని పటిష్ఠం చేసేందుకు సూచనలు ఇచ్చారు. నాయకులను కూడా కలుస్తున్నారు. ఇదే అవకాశం కొందరు మంత్రి పదవి ఆశావభహులు ఖర్గేను కలిసి తమ అవకాశాలు, బలాల గురించి వివరించారు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను ప్రస్తావించారు. అయితే, అందరూ చెప్పేది విన్న ఖర్గే.. అసలు పార్టీ వైఖరి ఏమిటో కూడా స్పష్టం చేశారు.

బంధువులూ దూరమయ్యారు..

ఖర్గే ముఖాముఖి కలిసిన వారిలో ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రంగారెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, బాలూనాయక్ ఉన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, సొంత బంధువులతోనూ వైరం వచ్చిందని, రేవంత్ టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఇంద్రవెల్లిలో సభతో పార్టీకి ఊపు తెచ్చానని అప్పుడే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని ప్రేమ్ సాగర్ రావు గుర్తు చేశారు. ఎన్నికల ముందు వచ్చినవారికి మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెట్టారని ఆయన వాపోయినట్లు సమాచారం.

ఇక తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు ఒక్క మంత్రి పదవీ లేకపోవడం సరికాదని, ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. గిరిజనులకు అన్యాయం జరిగిందని బాలూనాయక్ వాపోగా.. తనకూ చాన్స్ ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివేదికనే అందజేసినట్లు చెబుతున్నారు.

అయితే, అందరి అభిప్రాయాలు విన్న ఖర్గే.. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ స్వరూపం గురించి ఆరా తీశారు. ఎవరికీ మంత్రి పదవి హామీ ఇవ్వకుండానే.. బీఆర్ఎస్, బీజేపీ సామాజిక సమీకరణాలను అడిగి తెలుసుకున్నారు.

కూర్పులో భాగంగా రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవి అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. అంతేగాక ఇప్పట్లో విస్తరణ కూడా లేదనే సంకేతాన్ని ఖర్గే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.