ఆ ఫైట్ కోసం...తెలంగాణాలో హీట్ !
దాంతో ఆ ఎన్నికలోనూ గెలిచి సత్తా చాటాలని బీఆర్ ఎస్ చూస్తూంటే ఆ పార్టీ నుంచి సీటుని గుంజుకుని తమకు బలం ఉంది అని చాటాలని అధికార పార్టీ చూస్తోంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 9 July 2025 9:15 AM ISTతెలంగాణాలో రాజకీయం చూస్తే ఒక్కసారిగా హీటెక్కింది. అది కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. అంతే కాదు సవాళ్లూ ప్రతి సవాళ్ళూ చేసుకుంటున్నారు. ఒకరేమే అసెంబ్లీకి రమ్మంటే మరొకరు ప్రెస్ క్లబ్ లో డిబేట్ అంటున్నారు. ఈ విధంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య భీకర రాజకీయ సమరమే సాగుతోంది.
అయితే ఎందుకు ఇదంతా అన్నదే ఇపుడు అందరికీ పట్టుకుంది తెలంగాణా అసెంబ్లీకి ఎన్నికలు జరిగి ఏణ్ణర్థం అయింది కదా అంటున్నారు. ఇక లోక్ సభకు ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది మళ్ళీ ఈ లొల్లి ఏమిటి అని అంటున్నారు. అయితే రాజకీయ లెక్కలు లుక్కులూ వేరు అని సమాధానం వస్తోంది. ఎన్నిక ఒకటి అయిపోతే మరో ఎన్నిక బాకీ అలాగే ఉంటుంది. అంతే కాదు ఈసారి కాకపోతే మరోసారి లక్కు చిక్కకపోతుందా అన్నదీ ఉంది.
అందుకే ఇపుడు అటు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ తేల్చుకుందామని పోటీకి దిగుతున్నాయని అంటున్నాయి. ఈ సెప్టెంబర్ నెలకల్లా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రేపో మాపో స్థానిక ఎన్నికల నగారా మోగుతుందేమో అని గులాబీ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది అని అంటున్నారు అలాగే తమ ఎమ్మెల్యే మరణించడంతో జూబ్లీ హిల్స్ కి ఉప ఎన్నికలు వస్తున్నాయి.
దాంతో ఆ ఎన్నికలోనూ గెలిచి సత్తా చాటాలని బీఆర్ ఎస్ చూస్తూంటే ఆ పార్టీ నుంచి సీటుని గుంజుకుని తమకు బలం ఉంది అని చాటాలని అధికార పార్టీ చూస్తోంది అని అంటున్నారు. ఇలా ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి. ఇక లోకల్ బాడీస్ కి ఎన్నికలు పెడితే పెద్ద ఎత్తున సీట్లు ఓట్లూ తెచ్చుకుని 2028లో అధికారం తమదే అని చాటాలన్న లక్ష్యం కూడా బీఆర్ఎస్ కి ఉందని అంటున్నారు.
బీఆర్ఎస్ లో చూస్తే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బోణీ కొట్టలేక చతికిలపడింది. ఇపుడు లోకల్ ఫైట్ మీదనే ఆశలు నిండా పెట్టుకుంది అని అంటున్నారు. బీఆర్ఎస్ లో కవిత రూపంలో ఎదురవుతున్న సవాళ్ళకు జవాబు చెప్పాలన్నా లేక బీజేపీ ఎదగకుండా కళ్ళెం వేయాలన్నా సొంత పార్టీలో నిరాశను పారదోలాలన్నా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యమని అంటున్నారు.
అదే విధంగా అధికార కాంగ్రెస్ లో చూస్తే అదే పట్టుదల కనిపిస్తోంది. తన నాయకత్వం మీద విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. అలా సొంత పార్టీలోనూ బయటా గెలిచి చెక్ పెట్టాలని భావిస్తున్నారు అని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని ఒకరంటే ప్రెస్ క్లబ్ కే సీఎం చర్చకు రావాలని మరొకరు సవాల్ విసురుతున్నారని అంటున్నారు.
ఈ మధ్యలో తెలంగాణా ఏపీ సెంటిమెంట్లూ నీళ్ళూ నిధులు ఇలా చాలా అంశాలు నలిగిపోతున్నాయి. మరి ఈ రచ్చకు ఎంతో కొంత ఫుల్ స్టాప్ పడాలి అంటే లోకల్ బాడీ ఎన్నికలు వెంటనే పెట్టేస్తే ఎవరి సత్తా ఏమిటో తెలిస్తే కొంతకాలం అంతా గప్ చుప్ అయిపోతారు అని అంటున్నారు.
