టీ-కాంగ్రెస్‌కు 'స్థానికం' తిప్పలు.. తలోమాట!
తెలంగాణ కాంగ్రెస్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు పెను తిప్పలు పెడుతున్నాయి. తలోమాటతో ఈ ఎన్నిక ల వ్యవహారం... పార్టీ అధిష్టానానికి.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందులు తెస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Aug 2025 10:46 AM ISTతెలంగాణ కాంగ్రెస్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు పెను తిప్పలు పెడుతున్నాయి. తలోమాటతో ఈ ఎన్నిక ల వ్యవహారం... పార్టీ అధిష్టానానికి.. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బందులు తెస్తున్నాయి. వాస్తవానికి.. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలోనూ మూడు మాసాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 40 రోజులకు పైగా కాలం గడిచిపోయింది. అయినప్పటికీ.. ఈ ఎన్నికలపై పార్టీ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రభుత్వం కూడా వేచి చూస్తోంది. ఇంతలోనే దీనిపై భిన్నమైన వాదనలు వస్తున్నాయి.
పార్టీ చీఫ్.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్దామని పట్టుదలతో ఉన్నారు . దీనిపై సీఎం రేవంత్ కూడా ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. కానీ, అటు రాష్ట్రపతి బీసీ రిజర్వేషన్‌లకు సంబంధించిన బిల్లును ఆమోదించలేదు. పోనీ.. గవర్నర్ అయినా.. ఆర్డినెన్సుకు ఆమోదం చెప్పారా? అంటే అది కూడా లేదు. దీనిపై ఢిల్లీ స్థాయిలో పోరాటాలు చేసిన ఫలితం అయితే దక్కలేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే ప్రక్రియ ఇప్పట్లో ముందుకు సాగేలా కనిపించడం లేదు.
మరోవైపు.. బిల్లు చేసి, స్థానిక సంస్థల్లో అమలు చేయకపోతే.. అది సర్కారు చేసిన కృషికి ఎలాంటి ఫలితం ఇవ్వదన్నది పీసీసీ చీఫ్ ఆలోచన. ఇక, మంత్రులు కూడా.. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే.. మేలు జరుగుతుందని చెబుతున్నారు. కానీ.. దీనిని ఎలా అమలు చేయాలన్న విషయంపై ముఖ్యమంత్రి ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో తాజాగా రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీకి నిర్ణయించారు. దీనిలో మంత్రులు, పార్టీ సీనియర్ నాయకులను కూడా కలుసుకుని నిర్ణయించనున్నారు.
పార్టీకే పరిమితం!
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో హైకోర్టు ఆదేశాల మేరకు.. ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడిం ది. ఈ నేపథ్యంలో ఈ సారికి పార్టీ వరకే రిజర్వేషన్ అమలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆది నుంచి సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయాన్ని ప్రకటిస్తున్న దరిమిలా.. ఇప్పుడు నిర్వహించే రాజకీయ వ్యవహారాల కమిటీలోనూ.. ఇదే నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. అంటే.. పార్టీలోని బీసీలకు 42 శాతం టికెట్లు ఇచ్చి.. వారిని బరిలోనిలిపే ప్రక్రియకే ప్రస్తుతం పరిమితం కానున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత.. బిల్లు ఆమోదంపై మరింత వేడిగా యుద్ధం చేసే అవకాశం ఉంది.
