మహేశ్ వర్సెస్ షబ్బీర్.. వైరల్ ఆడియోతో టీపీసీసీ ఉక్కిరిబిక్కిరి!
తనకు ఇవ్వాల్సిన పదవిని చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వటాన్ని తప్పు పట్టిన సదరు వ్యక్తి.. తన ఆవేదనను షబ్బీర్ అలీకి ఫోన్ చేసి.. తాను ఉరి వేసుకోవటమే మిగిలిందని పేర్కొన్నారు.
By: Garuda Media | 14 Jun 2026 10:28 AM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ టార్గెట్ అయ్యారా? ఇటీవల కాలంలో ఆయన ఇరుకున పడేసేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడితో.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న షబ్బీర్ అలీ మాట్లాడినట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రిజెక్టు అంశంలో పార్టీలోని కోవర్టులతోనే ఇదంతా జరిగిందన్నది హాట్ టాపిక్ గా మారిన వేళలో.. ఈ కొత్త రచ్చ పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది.
అదే సమయంలో ఈ వ్యవహారంపై స్పందించిన టీపీసీసీ షబ్బీర్ అలీ వివరణ కోరటం గమనార్హం. పార్టీ అధినాయకత్వం సైతం ఈ ఉదంతంపై కన్నేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న అధిపత్య పోరుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైనట్లుగా చెబుతున్నారు. ఇంతకూ వైరల్ అవుతున్న ఆడియోక్లిప్ విషయానికి వస్తే.. ఈ ఆడియో క్లిప్ లో షబ్బీర్ అలీకి ఒకరు ఫోన్ చేయటం.. తన ఆవేదనను వ్యక్తం చేయటం.. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తాజా ఇష్యూకు కారణంగా చెప్పాలి.
తనకు ఇవ్వాల్సిన పదవిని చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వటాన్ని తప్పు పట్టిన సదరు వ్యక్తి.. తన ఆవేదనను షబ్బీర్ అలీకి ఫోన్ చేసి.. తాను ఉరి వేసుకోవటమే మిగిలిందని పేర్కొన్నారు. ఇలా ఆవేదన వ్యక్తం చేసిన నాయకుడ్ని ఓదారుస్తూ షబ్బీర్ అలీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పదవుల కోసం డబ్బులు పెడుతున్నారని.. మహిళల్ని ఎరగా వేసి పదవులు తీసుకుంటున్నారన్న కోణంలో వ్యాఖ్యలు ఉండటం ఇప్పుడు కొత్త కలకలానికి కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ పేరును ఆడియోలో ప్రస్తావించటంతో.. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీగా మారిందన్న వ్యాఖ్యలు కొత్త సంచలనంగా మారాయి. అయితే.. ఈ ఆడియో ఎప్పటిది? అన్న దానిపై క్లారిటీ రావటం లేదు.
ఈ ఆడియో వైరల్ కావటంతో.. దీనిపై వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి. దీంతో.. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన మహేశ్.. ఆరోపణల విషయంలో తొందరపాటు లేదన్న ఆయన.. తన వ్యక్తిత్వం.. ఆస్తిపాస్తులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిచితమేనని పేర్కొన్నారు. నలభై ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుంది? అని ప్రశ్నించిన ఆయన.. ఆరోపణలు చేసిన వ్యక్తిని షబ్బీర్ అలీనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పార్టీలో చేర్పించారన్నారు.
సీఎం సిఫార్సు చేసినందుకే చంద్రశేఖర్ రెడ్డికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పదవి వచ్చిందని స్పష్టత ఇచ్చారు. ఏదైనా మాట్లాడే వేళలో జాగ్రత్తగా మాట్లాడాలని.. మహిళల పరువు తీసేలా వ్యాఖ్యలు చేయొద్దన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడో అంశం ఆసక్తికర చర్చగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ తన రెండేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించారన్న సందర్భంలోనే ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇక.. టీపీసీసీ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యలు సరికావని.. వీటిపై వివరణ ఇవ్వాలంటూ షబ్బీర్ అలీకి లేఖ రాశారు. దీనిపై ఆలస్యం చేయకుండా స్పందించాలని కోరారు. మరి.. దీనిపై షబ్బీర్ అలీ స్పందన ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
