90 సీట్లు-పదేళ్ల అధికారం.. కాంగ్రెస్ టార్గెట్ బాగుందే!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే కాదు.. మరో పదేళ్ల వరకు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 4 July 2025 4:48 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ భారీ లక్ష్యాన్నే నిర్దేశించుకుంది. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకోవడమే కాదు.. మరో పదేళ్ల వరకు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేసింది. ఇదేదో చిన్న చిన్న నాయకులు చెప్పిన మాట కాదు. ఏకంగా.. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌లు చెప్పిన మాట. తాజాగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంస్థాగత సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పార్టీకి శ్రీరామరక్షగా పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పక్కాగా కాంగ్రెస్ ఖాతాలో పడతాయని చెప్పారు. అసలు ప్రభుత్వ వ్యతిరేకత అనే మాటే లేదని.. దీనిని పుట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపే ప్రజలు ఉంటారని వ్యాఖ్యానించారు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి కూడా దాదాపు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో పదేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తిరుగులేదన్నారు. ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. ఎక్కడా అవినీతి లేకుండా పాలన అందిస్తున్నట్టు చెప్పారు.
అయితే.. ఈ బాధ్యతను క్షేత్రస్థాయిలో నాయకులు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో నాయకులకు పదవులు ఇస్తున్నామని.. వాటిని లైట్‌గా తీసుకోవద్దని తెలిపారు. కష్టపడి పనిచేయడం ద్వారానే పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. కష్టపడి పనిచేసేవారికి పదవులు కూడా దక్కుతాయన్నారు. ఇప్పడు కష్టపడి పనిచేస్తేనే.. భవిష్యత్తులో పదవులు ఇస్తామని తేల్చి చెప్పారు. తాను పార్టీ చీఫ్‌గా ఉన్నప్పుడు 50 వేల సభ్యత్వాలు నమోదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
సాధ్యమేనా?
కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆశలు ఉండొచ్చు.. మరి ఇవి సాధ్యమేనా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. మారు తున్న కాలానికి అనుగుణంగా రాజకీయాలు కూడా మారుతున్నాయి. మాకేం ఇస్తున్నారని మాత్రమే కాదు.. మాకేం తెస్తున్నారని కూడా ప్రజలు చూస్తున్నారు. ఇదేసమయంలో ఉద్యోగ, ఉపాధి తదితర అంశాలు కూడా కొలమానంగా మారాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుందా? అనేది ప్రశ్న. మరోవైపు బీజేపీ, బీఆర్ ఎస్‌ల నుంచి తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ గట్టి లక్ష్యం చర్చగా మారింది.