టీ-కాంగ్రెస్‌లో కొలువుల సంబరం.. విషయం ఏంటంటే!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త పదవుల సంబరాలు ప్రారంభమయ్యాయి. గత 5వ తేదీతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల పదవులు ముగిశాయి.
By: Garuda Media | 9 July 2026 6:00 PM ISTతెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త పదవుల సంబరాలు ప్రారంభమయ్యాయి. గత 5వ తేదీతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 37 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్ల పదవులు ముగిశాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2023లో ఈ పదవులను పార్టీలో బాగా పనిచేసిన వారికి.. ఎన్నికల సమయంలో ప్రచారం చేయడంతో పాటు సొంత నిధులు ఖర్చు చేసి పార్టీ కోసం శ్రమించిన వారికి ఇచ్చారు. అయితే.. రెండేళ్ల పదవీ కాలాలు ముగిసిపోయాయి.
ఈ నేపథ్యంలో ఆయా పదవులు దక్కించుకున్న వారు ఏం చేశారు..? ఈ రెండేళ్లలో సాధించిన పురోగతి ఏంటనేది పార్టీ రాష్ట్రనాయకత్వం సేకరిస్తోంది. వచ్చే వారంలో తిరిగి ఈ పదవులను కొత్తవారికి కట్టబెట్టనున్నారు. వీటిలో ప్రధానంగా డిమాండ్ ఉన్న పదవుల విషయంలో నాయకులు పైవారిని పట్టుకుని తిరిగి తమ పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు చైర్మన్లుగా వ్యవహరించిన వారి పనితీరును బట్టే రెన్యువల్ ఉంటుందని నాయకులు చెబుతున్నారు.
కానీ, సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మరోలా ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న వారికి అందరికీ టికెట్లు దక్కే పరిస్థితి లేదని భావిస్తున్న ఆయన.. వారిని శాంతింప చేసేందుకు.. ప్రస్తుతం ఖాళీ అయిన 37 చైర్మన్ పదవులతో పాటు పాలక మండళ్ళ పదవులను కూడా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే.. ఈ పదవులు దక్కిన వారికి ఇక, టికెట్లు ఉండవన్నది పార్టీ స్పష్టం చేసినట్టు అవుతుంది. దీనికి కొందరు నాయకులు ససేమిరా అంటున్నారు.
తమకు నామినేటెడ్ పదవులు అవసరం లేదని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ కు చెందిన నాయకులు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లే కావాలని కోరుతున్నారు. అయితే.. వీరిని అనునయించైనా ఈ పదవులు ఇచ్చేసి.. వచ్చే ఎన్నికల నాటికి అసంతృప్తులు లేకుండా చూసుకోవాలని పార్టీ భావిస్తోంది. ప్రస్తుత పదవుల్లో మార్కెట్ యార్డు చైర్మన్లు, ఆలయ పాలక మండళ్ల పదవులు హాట్ కేకుల్లా ఉన్నాయి.
