కాలేజీ అమ్మాయిలకు ఈవీ స్కూటర్లు.. రేవంత్ భారీ ఆఫర్
కాలేజీ విద్యార్థినులకు ఈవీ మోపెడ్ లు ఉచితంగా ఇస్తామన్న వరాన్ని ఆయన ప్రకటించారు.
By: Garuda Media | 9 March 2026 10:33 AM ISTపాలన మీద అంతకంతకూ పట్టు పెంచుకుంటూ పోతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా దినోత్సవం సందర్భంగా అనూహ్య రీతిలో చేసిన పథకం ఆసక్తికరంగా మాత్రమే కాదు. మహిళామణులను ఆకట్టుకునేలా మారింది. సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఇచ్చే వరాలకు భిన్నంగా ఆయన.. ఎన్నికలకు దాదాపు రెండున్నరేళ్ల ముందే ప్రకటించిన పథకం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యేలా మారింది. కాలేజీ విద్యార్థినులకు ఈవీ మోపెడ్ లు ఉచితంగా ఇస్తామన్న వరాన్ని ఆయన ప్రకటించారు.
మహిళా దినోత్సం నాడు కేవలం శుభాకాంక్షలు చెప్పటమే కాదు.. వేలాది మంది ఆడబిడ్డలను పిలిచి.. ప్రభుత్వం చేపట్టిన డెవలప్ మెంట్.. సంక్షేమ కార్యక్రమాల్ని వివరిస్తున్నామని చెప్పిన రేవంత్.. 200 బిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిదేళ్లలో ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చటం కోసం పని చేస్తున్నట్లు ప్రకటించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి.. అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించామని.. సౌత్ కొరియా.. న్యూయార్క్.. టోక్యోతో హైదరాబాద్ పోటీ పడేలా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి చాలా క్లారిటీతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. మిగిలిన ముఖ్యమంత్రుల మాదిరి ఆయన మాటలు ఉండటం లేదు. సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వచ్చినప్పుడు తమకు తిరుగులేదని.. రాబోయే ఇరవై.. పాతికేళ్లు తమదే అధికారం అని చెప్పటం కనిపిస్తుంది. అందుకు భిన్నంగా సీఎం రేవంత్ మాత్రం.. తాను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని మాత్రమే చెప్పటం కనిపిస్తుంది. మిగిలిన వారి మాదిరి అతిశయోక్తులు.. సాధ్యం కాని కలల్ని తాను కనటం లేదన్న సంకేతాన్ని స్పష్టంగా ఇవ్వటం కనిపిస్తుంది.
లాజిక్ గా చూసినా.. ఒక ముఖ్యమంత్రి వరుసగా రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అంత కష్టసాధ్యమైన విషయం కాదు. ప్రభుత్వ వ్యతిరేకత మొదటి దఫాతో పోలిస్తే.. రెండో దఫాలోనే ఎక్కువ ఉంటుంది. అందుకే దశాబ్దాల తరబడి తాము అధికారంలో ఉంటామనే రొడ్డుకొట్టుడు పాలకుల తీరుకు భిన్నంగా ప్రాక్టికల్ ఆలోచనలతో సీఎం రేవంత్ మాటలు ఉండటం ఆయనకు ఒక ప్లస్ పాయింట్ గా చెప్పాలి.
తన ఎజెండాలో భాగంగా వచ్చే ఎన్నికల నాటికి తాను చేయాల్సిన పనుల్ని సగం కంటే ఎక్కువగా పూర్తి చేసి.. మరోదఫా అధికారం చేతికి ఇస్తే.. మిగిలిన భాగం పూర్తి చేస్తామన్న భావన ప్రజల్లో కలిగేలా చేయాలన్నట్లుగా ఆయన వ్యూహం ఉందన్న మాట వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే.. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఉన్నాయని చెప్పాలి. తాజాగా కాలేజీ అమ్మాయిలకు ఈవీ మోపెడ్ లు ఉచితంగా ఇస్తామన్న ప్రకటన వెంటనే మొదలు పెట్టకపోవచ్చు. కానీ.. మహిళా దినోత్సవం సందర్భంగా తాను ఇచ్చిన వరాన్ని.. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు మొదలు పెట్టినా.. మైలేజీ ఖాయం. మొత్తంగా తాను వేసే ప్రతి అడుగును.. తర్వాతి దఫా అధికారం చేతికి వచ్చేలా ప్లాన్ చేసుకున్నట్లుగా సీఎం రేవంత్ తీరు ఉందని చెప్పాలి. ముఖ్యమంత్రి ఆలోచనలు ఎన్ని ఉన్నా.. కాలం అన్నది ఎలాంటి పరిస్థితులను ఎదురయ్యేలా చేస్తుందో చూడాలి.
