Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఈ రోజు నుంచి చికెన్ షాపులు బంద్

ముక్క లేకుంటే ముద్ద దిగదా? అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్లకు చుక్కలు కనిపించే నిర్ణయం వెలువడింది.

By:  Garuda Media   |   1 April 2026 4:38 PM IST
తెలంగాణలో ఈ రోజు నుంచి చికెన్ షాపులు బంద్
X

ముక్క లేకుంటే ముద్ద దిగదా? అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్లకు చుక్కలు కనిపించే నిర్ణయం వెలువడింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తమ షాపుల్ని బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ రోజు (బుధవారం, ఏప్రిల్ 1) నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే లాభాన్ని తగ్గించటంతో వ్యాపారులు తీవ్రఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారన్నది చికెన్ వ్యాపారుల వాదన.

తమకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్. ఈ సందర్భంగా తమకు ఎదురవుతున్న ఇబ్బందుల్ని వారు ఏకరువు పెడుతున్నారు. గతంలో పౌల్ట్రి యజమానులు రిటైల్ షాపులకు కేజీకి రూ.26 చొప్పున మార్జిన్ ఇచ్చే వారని.. గడిచిన రెండు దశాబ్దాలుగా రూ.26 మాత్రమే మార్జిన్ ఉందన్నారు. అయితే.. ఇటీవల ఈ మార్జిన్ ను రూ.16కు తగ్గించిన తీరును వారు తప్పు పడుతున్నారు. ప్రస్తుతం గరిష్ఠ ధరల నేపథ్యంలో చికెన్ మార్జిన్ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు

ఇప్పుడున్న పరిస్థితుల్లో కేజీ చికెన్ మార్జిన్ ను రూ.30చొప్పున ఇవ్వాలన్నది చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ తాజా నిర్ణయం. చికెన్ అమ్మకాలపై వస్తున్న లాభం చాలా తక్కువగా ఉండటంతో షాపుల్ని నిర్వహించటం కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చికెన్ వ్యాపారులు జీవనోపాధి కొనసాగించటం కష్టమేనని వారు పేర్కొన్నారు. తమకు పెంచాల్సిన మార్జిన్ ను వెంటనే పెంచాలని.. కేజీకి రూ.30 చొప్పున మార్జిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే తమకు ఎదురవుతున్న కష్టాలు తీరుతాయని వాపోతున్నారు. తమ సమస్యకు పరిష్కారం చూపే దిశగా అడుగులు పడాలని చికెన్ షాపు యజమానులు కోరుకుంటున్నారు. అంతవరకు చికెన్ ప్రియులకు చుక్కలు కనిపిస్తాయని చెప్పకతప్పదు.