అప్పుడు బియ్యం.. ఇప్పుడు ఎరువు.. కేంద్రం సాధింపు!
దీంతో నేరుగా కేసీఆర్ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉండి.. ధర్నాలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 9 July 2025 9:42 AM ISTతెలంగాణ విషయంలో కేంద్రం సాధింపుల రాజకీయాలు కొనసాగిస్తోందా? ఇక్కడి ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా అడుగులు వేస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. బియ్యం విషయంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి ఇబ్బందులు వచ్చాయి. బియ్యాన్ని ఎఫ్ సీఐ ద్వారా కొనుగోలుచేయాలని అప్పటి సీఎం కేసీఆర్ అనేక మార్లు..కేంద్రానికి విజ్ఞప్తులు చేశారు. అయినా.. కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు.
దీంతో నేరుగా కేసీఆర్ ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉండి.. ధర్నాలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయినా.. రైతులకు మేలు చేయాలన్న సంకల్పంతో కేసీఆర్.. ధర్నాలు చేసి.. కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేశారు. అయితే.. దీనివెనుక రాజకీయం కూడా ఉందని విమర్శలు వచ్చినా.. రైతుల విషయంలో కేంద్రం చేస్తున్న తొండిని మాత్రం బహిరంగ పరిచినట్టు అయింది. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ విషయంలోనూ ఇదే రైతు సమస్య తెరమీదికి వచ్చింది.
రాష్ట్రానికి ఎరువులు పంపించాలంటూ.. సీఎం రేవంత్‌రెడ్డి కొన్నాళ్లుగా కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. కానీ.. కేంద్రం ససేమిరా అంటోంది. అంతేకాదు.. సంప్రదాయక విధానంలో పంటలను ప్రోత్సహించాలని చెబుతోంది. మరోవైపు.. ఖరీఫ్ అదును తప్పుతున్న నేపథ్యంలో రైతుల నుంచి తీవ్ర విమర్శలు తెలంగాణ సర్కారుకు ఎదురవుతున్నాయి. దీంతో కేంద్రం నుంచి ఏదో ఒక రకంగా ఎరువులు(యూరియా) తెప్పించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రయాస పడుతున్నారు.
వాస్తవానికి రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ప్రాజెక్టులపై ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఉంటున్నాయి. కానీ, రాష్ట్రానికి ఎరువులు ఇవ్వాలని కోరుతూ.. తొలిసారి సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి ఇలా చేయడం తొలిసారే అయినా.. క్షేత్రస్థాయిలో కేంద్రం ఏమేరకు రాష్ట్రాన్ని సాధిస్తోందన్నది ఈ వ్యవహారం స్పష్టం చేస్తోందని తెలంగాణ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండి కూడా బీజేపీ కనీసం.. ఎరువులు ఇవ్వలేని పరిస్థితిలో ఉండడాన్నితప్పుబడుతున్నారు.
