Begin typing your search above and press return to search.

0.4 పర్సంటేజ్ ఉన్న కులానికి రెండు పార్టీలు!

రాజకీయాల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలు అంటారు. తమాషాలు చిత్రాలు కూడా చెప్పనవసరం లేదు.

By:  Satya P   |   22 April 2026 1:31 PM IST
0.4  పర్సంటేజ్ ఉన్న కులానికి రెండు పార్టీలు!
X

రాజకీయాల్లో ఎన్నో వింతలూ విడ్డూరాలు అంటారు. తమాషాలు చిత్రాలు కూడా చెప్పనవసరం లేదు. రాజకీయం అంటేనే అలా అనుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే రాజకీయం అంటే ప్రజా సేవ అని సూక్ష్మంగా చెప్పుకుంటారు. కానీ దానికి ఎన్నో జత చేర్చుకోవాల్సిన రోజులివి. ఎవరు అయినా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇపుడు అంతా కుల రాజకీయాలే భారత దేశం మొత్తం మీద ఉన్నాయన్నది చెప్పక తప్పదు. ఉత్తర భారతంలో కూడా యాదవ్ ప్లస్ ముస్లిం అని కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. హిందూత్వంతో ఇంకొక పార్టీ ఉంటే మైనారిటీల కోసం సైతం పార్టీలు నడుస్తున్నాయి. ఏపీలో చెప్పాల్సిన పని లేదు. రెడ్డి వర్సెస్ కమ్మగా ఉన్న రాజకీయం కాస్తా కాపులు కూడా తమ వాటా కోసం రంగంలోకి దిగడంతో మూడుగా మారింది.

ఏపీలో ఆ మూడూ :

ఇక పచ్చిగా చెప్పుకోవాలీ అంటే ఏపీలో మూడు కుల పార్టీలుగానే ఉన్నాయి. ఎవరి కుల వాళ్ళ పార్టీకి దాదాపుగా 90 శాతం ఓట్లు పడేలా ఈ కుల రాజకీయం సాగుతోంది. ఇక న్యూట్రల్ ఓట్లు ఉంటే ఎవరైనా గెలుస్తారు, ఎవరిదైనా అధికారం అవుతుంది. అయితే తెలంగాణా రాజకీయాల ముఖ చిత్రం ఒక్కసారి చూతే కనుక ఇపుడు అక్కడ కాంగ్రెస్ లో రెడ్డీలు దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం నాయకులు ఉన్నారు. అలాగే తెలంగాణాలో బీజేపీకి హిందూత్వ మీద పార్టీ పునాదులు ఉన్నాయి. ఇంక బీఆర్ఎస్ కేసేఆర్ కి ఉన్న బలం అంతా తెలంగాణా వాదం అన్నది తెలిసిందే. ఈ సిద్ధాంతం తోనే ఆయన టీఆర్ఎస్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ గా మార్చారు. ఆయన గెలుపు ఓటములు అన్నీ ఈ వాదం మీదనే ఆధారపడి సాగుతున్నాయి. కేసీఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు అయినా తెలంగాణా వాదం మీదనే ఆ సెంటిమెంట్ తోనే గెలిచారు అన్నది కూడా వాస్తవం.

తెలంగాణా సెంటిమెంట్ :

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయి 12 ఏళ్ళు పై దాటుతోంది. ఈ మధ్యలో మూడు ఎన్నికలు జరిగాయి. అందులో రెండు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ గెలిచింది. మూడవది కాంగ్రెస్ సొంతం అయింది. అయినా ఇప్పటికీ కేసీఆర్ తెలంగాణా వాదాన్నే గట్టిగా నమ్ముకున్నారు ఆ విధంగానే తన పార్టీని నడిపిస్తూ ముందుకు సాగుతున్నారు ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఏపీకే పరిమితం అయిన కులాల కుంపట్లు సామాజిక సమీకరణలు అన్నీ కూడా తెలంగాణాకు కూడా పాకాయి. దాంతో తెలంగాణా ఇపుడు కులాల వేడిలో కాగిపోతూ రగిలిపోతూ ఉంది.

నిఖార్సు అయిన లెక్క :

తెలంగాణాలో ఇన్నాళ్ళూ లేని కొత్త పోకడ ఇది. నిజం చెప్పాలీ అంటే అక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ. సామాజిక చైతన్యం కంటే ప్రజా సమస్యల మీద జనాలు కలసికట్టుగా ఉంటారు, ఒక్కసారిగా ఉద్యమిస్తారు. ఆ ప్రాతిపాదికనే రాజకీయం సాగుతూ వస్తోంది. అయితే కులాల సమాహారంగా రాజకీయాలు ఇపుడు తెలంగాణాలో కొత్త దారిలో సాగుతున్నాయి. దాంతో ఎవరి కులం ఏమిటి ఏ పార్టీ అధినాయకుడు సొంత సామాజిక వర్గం బలమేమిటి అన్నది చర్చగా ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చూస్తే కేసీఆర్ సొంత సామాజిక వర్గం అయిన వెలమలకు తెలంగాణాలో ఉన్న పర్సంటేజ్ 0.4 గా ఉంది. దాదాపుగా నాలుగు కోట్లకు చేరువ అవుతున్న తెలంగాణా జనాభాలో ఈ 0.4 శాతం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

రెండు పార్టీలతో అలా :

ఇదిలా ఉంటే 0.4 పర్సంటేజ్ తో ఉన్న వెలమ సామాజిక వర్గానికి రెండు పార్టీలు ఇపుడు ఉండడమే అసలైన రాజకీయ చిత్రంగా చెప్పుకుంటున్నారు. తండ్రి కేసీఅర్ బీఆర్ఎస్ అధినేతగా ఉంటే ఆయన కుమార్తె కవిత కూడా కొత్త పార్టీ పెడుతున్నారు. ఇలా తండ్రీ కూతుర్ల రాజకీయ పంచాయతీకి తెలంగాణా గడ్డ మీద తెర లేస్తోంది. రెండు పార్టీలు అవసరమా అంటే కవిత సొంత పార్టీని కుటుంబాన్ని విభేదించి బయటకు వచ్చేశారు. నిజానికి చూస్తే కవితకు ఎంపీగా సొంతంగా గెలిచే స్కోప్ కూడా లేదని విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఆమె మాత్రం పార్టీ సొంతంగా పెట్టి బీసీ నినాదం అందుకుంటున్నారు. అయితే ఒక రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఒక పార్టీ ఎమర్జ్ కావాలీ అంటే కచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరగాల్సి ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తెలుగువాదంతో బలంగా జనంలోకి వచ్చారు. జగన్ అయితే వైఎస్సార్ నినాదంతో రాజకీయ తెరపైకి వచ్చారు. ఆ సమయంలో ఆయనను జైలులో ఉంచడంతో అరెస్ట్ సానుభూతి కూడా వర్కౌట్ అయింది. కేసీఆర్ విషయమే తీసుకుంటే తెలంగాణా వాదమే ఆయన ఉద్యమానికి పార్టీకి కూడా ఆయువు పట్టుగా ఉంది అన్నది తెలిసిందే.

భావోద్వేగంతోనే పార్టీలు :

దీనిని బట్టి తేలేది ఏంటి అంటే ఏదో బలమైన భావోద్వేగంతోనే పార్టీలు పురుడు పోసుకుంటాయి. జనాల్లోకి దూసుకుని వెళ్తాయి. అంతే తప్ప తన తండ్రి మోసం చేశారు అని అన్న ఆదరించలేదు అని కవిత చెబుతూ జనంలోకి కొత్త పార్టీగా వస్తే ప్రజలకు ఇచ్చే సందేశం ఏమి ఉంటుంది అని అంటున్నారు. అంతే కాదు ఆ పార్టీ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అని కూడా ప్రశ్నలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా జనాల్లో కదిలించాలి. అప్పటివరకూ ఉన్న పార్టీలలో కొత్తదనం చూపించాలి. నాయకత్వం బలంగా కనిపించలి. జనాలను ఆలోచింపచేసే నినాదాలు ఉండాలి. మరి ఇవేమీ లేకుండా కోపంతోనో లేక ఆవేశంతోనో పార్టీలు పెడితే మనుగడ సాగించలేవు అనడానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కవిత పార్టీ సంగతి ఏమిటి అన్నది రేపు జనాలే నిర్ణయిస్తారు అని అంటున్నారు.