Begin typing your search above and press return to search.

తెలంగాణ రాష్ట్రంలో ఏడు కులాల చేతుల్లో సగానికి పైగా భూమి..

ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన ‘కులగణన సర్వే’ నివేదికలోని భూయాజమాన్య గణాంకాలు సామాజిక సమీకరణాలపై కొత్త చర్చను లేవనెత్తుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   16 April 2026 3:37 PM IST
తెలంగాణ రాష్ట్రంలో ఏడు కులాల చేతుల్లో సగానికి పైగా భూమి..
X

ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిన ‘కులగణన సర్వే’ నివేదికలోని భూయాజమాన్య గణాంకాలు సామాజిక సమీకరణాలపై కొత్త చర్చను లేవనెత్తుతున్నాయి. జనాభా నిష్పత్తికి, భూమి పంపిణీకి మధ్య ఉన్న అగాధాన్ని ఈ నివేదిక కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఫలితాలు రాష్ట్రంలోని భూయాజమాన్య సరళిని విశ్లేషించడంలో కీలక మలుపుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం భూముల్లో సగానికి పైగా, అంటే 51.4 శాతం భూమి కేవలం ఏడు ప్రధాన కులాల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉందని సర్వే స్పష్టం చేసింది. విశేషం ఏంటంటే ఈ ఏడు కులాల జనాభా కలిపినా రాష్ట్ర మొత్తం జనాభాలో కేవలం 32 శాతం మాత్రమే కావడం గమనార్హం. అంటే తక్కువ జనాభా ఉన్న వర్గాల వద్దే ఎక్కువ భూమి ఉండడం సామాజిక అంతరాలను సూచిస్తోంది.

జనాభాకు మించి భూమి!

సర్వే గణాంకాల ప్రకారం.., రాష్ట్ర జనాభాలో కేవలం 4.8 శాతం మాత్రమే ఉన్న ఓసీ రెడ్డి సామాజిక వర్గం, మొత్తం భూముల్లో 13.5 శాతం కలిగి అగ్రస్థానంలో నిలిచింది. అంటే వారి జనాభా నిష్పత్తి కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ భూమిని ఈ వర్గం కలిగి ఉంది. వీరి తర్వాత యాదవ (8.7%), లంబాడీ (8.6%), ముదిరాజ్ (7.8%) కులాలు వరుసగా ఎక్కువ శాతం భూములను కలిగి ఉన్నాయి.

బీసీ-బీ కురుమలకు ప్రథమ స్థానం

రాష్ట్రంలో అత్యధిక శాతం కుటుంబాలకు భూమి ఉన్న కులాల్లో బీసీ-బీ కేటగిరీకి చెందిన కురుమలు నిలిచారు. ఈ సామాజిక వర్గంలో ఏకంగా 62 శాతానికి పైగా కుటుంబాలు ఎంతో కొంత భూమిని కలిగి ఉన్నాయి. వీరి తర్వాత ఆరేవాళ్లు, కోయ, లంబాడీ, మాదాసి కులాల్లో కూడా 60 శాతం కుటుంబాలకు భూమి ఉంది. అయితే, భూమి కలిగి ఉండడం వేరు, పెద్ద మొత్తంలో భూమి ఉండడం వేరు అని సర్వే విశ్లేషించింది.

20 ఎకరాలకన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూములు ఉన్న వారి జాబితా ఆసక్తికరంగా ఉంది. అత్యధికంగా ఓసీ జైన్‌లలో 8.2 శాతం కుటుంబాల వద్ద 20 ఎకరాలకన్నా ఎక్కువ భూమి ఉంది. ఓసీ రాజుల్లో 7.5%, బ్రాహ్మణుల్లో 6.8%, బీసీ గంగిరెడ్ల వారిలో 6% కుటుంబాలు ఎక్కువ మొత్తంలో భూమి (కమతాలు) కలిగి ఉన్నాయి. మరోవైపు, ఎస్సీ మాదిగ, బేడ వంటి కులాల్లో 90 శాతం కుటుంబాలకు కేవలం 5 ఎకరాలకన్నా తక్కువ భూమి మాత్రమే ఉంది, ఇది దళిత వర్గాల్లో ఉన్న పేదరికాన్ని మరియు భూమి కొరతను సూచిస్తోంది.

నగర జీవనం వర్సెస్ గ్రామీణ భూమి

ఓసీ విభాగంలోని రాజులు, ముస్లింలు, జైన్‌లు, బ్రాహ్మణుల్లో కేవలం 10 శాతం కంటే తక్కువ కుటుంబాలకే భూమి ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ వర్గాలు ఎక్కువగా నగర ప్రాంతాల్లో నివసించడం లేదంటే వృత్తిపరంగా వ్యవసాయానికి దూరంగా ఉండడం అయి ఉండవచ్చు. అయితే భూమి ఉన్న కొద్ది మందిలో మాత్రం 30 శాతం మందికి 5 నుండి 20 ఎకరాల వరకు భూమి ఉంది.

ఈ కులగణన సర్వే నివేదిక కేవలం గణాంకాలే కాదు.., భవిష్యత్తులో ప్రభుత్వం ప్రవేశపెట్టే భూ సంస్కరణలకు లేదంటే సంక్షేమ పథకాలకు ఇది మార్గదర్శిగా మారనుంది. 32 శాతం జనాభా వద్ద 51.4 శాతం భూమి ఉందంటే, మిగిలిన 68 శాతం జనాభా కేవలం 48.6 శాతం భూమిపైనే ఆధారపడుతున్నారని అర్థం. ముఖ్యంగా ఎస్సీ మాదిగ వర్గం జనాభాలో 10.3 శాతం ఉండి, భూమి కేవలం 6.5 శాతం మాత్రమే కలిగి ఉండడం ఆ సామాజిక వర్గంలో భూమిలేని పేదల సంఖ్య ఎక్కువగా ఉందని చాటిచెబుతోంది.