మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కేది ముగ్గురికా? నలుగురికా?
నిబంధనల ప్రకారం మొత్తం ఆరుగురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉన్నా.. తాజా విస్తరణలో నలుగురు లేదంటే ముగ్గురికి చోటు లభించే అవకాశం ఉందంటున్నారు.
By: Tupaki Desk | 8 Jun 2025 9:47 AM ISTఅదిగో పులి.. ఇదిగో తోక అన్నట్లుగా అదే పనిగా కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై వార్తా కథనాలు రావటం తెలిసిందే. ప్రతిసారీ.. చివరకు వచ్చి.. ఈసారి పక్కాగా విస్తరణ ఖాయమన్న మాట బలంగా వినిపించినా.. ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉండగా.. ఈసారి పక్కాగా మంత్రివర్గ విస్తరణ ఖాయమని చెబుతున్నారు. శనివారం అర్థరాత్రి వరకు మంత్రివర్గ విస్తరణ మీద అప్డేట్స్ వస్తున్నాయి. అయితే.. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున 5.45 గంటలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించిన నేపథ్యంలో విస్తరణ కార్యక్రమం ఉంటుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.
ముందుగా ప్రచారం జరిగిన షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఆదివారం మధ్యాహ్నం 12 నుంచి 12.20గంటల మధ్యలో ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే.. మంత్రి పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఎంత మందికి దక్కుతాయి? అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణలోకి తీసుకొని ఎస్సీ.. ఎస్టీ.. బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో.. మొదట్నించి విస్తరణలో ఖాయంగా పదవులు వస్తాయని భావించిన సుదర్శన్ రెడ్డి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల పేర్లు వెనక్కి వెళ్లినట్లు చెబుతున్నారు.
విస్తరణలో ఎవరికి పదవులు దక్కాలన్న దానిపై అధిష్ఠానం పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్.. ఉప ముఖ్యమంత్రి భట్టి.. సీనియర్ మంత్రి ఉత్తమ్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తోపాటు.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ తో చర్చలు జరిపి.. వారి అభిప్రయాల్ని సేకరించారు. విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలన్న దానిపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తామన్న అధినాయకత్వం.. అందుకు తగ్గట్లే శనివారం తన అభిప్రాయాన్ని తెలిపినట్లుగా తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం మొత్తం ఆరుగురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉన్నా.. తాజా విస్తరణలో నలుగురు లేదంటే ముగ్గురికి చోటు లభించే అవకాశం ఉందంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి ముగ్గురికి చోటు లభిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో ఖాళీగా ఉన్న చీఫ్ విప్ పదవిని కూడా భర్తీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
బీసీల నుంచి శ్రీహరి (ముదిరాజ్).. ఎస్సీల నుంచి వివేక్ (మాల).. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (మాదిగ)కు చోటు లభిస్తుందని చెబుతున్నారు. డిప్యూటీ స్పీకర్ గా రామచంద్రునాయక్ ను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి కూడా చోటు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈసారి కష్టమన్న మాట వినిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే కం సభాపతిగా వ్యవహరిస్తున్న ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకొని.. అదే సామాజిక వర్గానికి చెందిన మరొకరిని స్పీకర్ ను చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటికైతే ముగ్గురికి మాత్రమే మంత్రివర్గంలో చోటు లభించే వీలుందని తెలుస్తోంది.
