తెలంగాణ కొత్త మంత్రులు.. ఆ ఒక్క శాఖకు డిమాండ్!
ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొందరు శాఖలు మార్పుకోరుకుంటుండగా, ఎవరికీ కేటాయించని ఓ శాఖ కోసం దాదాపు అందరూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 29 March 2025 3:00 PM ISTతెలంగాణలో కొత్త మంత్రుల నియామకం దాదాపు ఖరారైందని ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి నాలుగు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయిందని అంటున్నారు. ఈ నలుగురి పేర్లపై తుది నిర్ణయానికి వచ్చిందని ప్రకటించడమే మిగిలివుందని చెబుతున్నారు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే మంత్రులతోపాటు ప్రస్తుతం కేబినెట్ లో కొనసాగుతున్నవారు కూడా తమ శాఖల కోసం ఫోకస్ పెట్టారంటున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కొందరు శాఖలు మార్పుకోరుకుంటుండగా, ఎవరికీ కేటాయించని ఓ శాఖ కోసం దాదాపు అందరూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతున్నా మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. అయితే పార్టీపై తీవ్ర ఒత్తిడి వస్తుండటం, కొన్ని ఉమ్మడి జిల్లాలకు అసలే ప్రాతినిధ్యం లేకపోవడంతో కొత్త మంత్రులను నియమించాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక, ప్రాంతీయ సమీకరణలను పరిగణలోకి తీసుకుని మంత్రులను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కు మంత్రి పదవులు ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఇరువురి ఎంపికపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు.
ప్రధానంగా లంబాడ, మాదిగ, ముదిరాజ్ సామాజికవర్గాల వారు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఎస్సీ సామాజికవర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరూ మాల సామాజికవర్గం వారే కావడంతో మాదిగలు ప్రాతినిధ్యం కోరుతున్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం తాజాగా అదేవర్గానికి చెందిన వివేక్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించిందని ప్రచారం జరుగుతుండటంతో మాదిగ సామాజికవర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. అంతేకాకుండా వివేక్ కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఉన్నారని, ఇప్పుడు అదనంగా మంత్రి పదవి ఇవ్వడం కరెక్టు కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడికి కూడా మంత్రి పదవి ఇవ్వడంపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది.
ఇలా నేతల ఓ వైపు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, కొత్తగా పదవులు చేపడతారని చెబుతున్న నేతలు మాత్రం తమకు ఫలానా శాఖ కావాలంటూ కండీషన్లు పెడుతుండటం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకు తెలంగాణలో హోంశాఖను ఎవరికీ కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే హోంశాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ శాఖకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రస్తుత మంత్రులతోపాటు కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం హోంశాఖను ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారికంగా తన పేరు ప్రకటించకపోయినా, తనకు హోంశాఖ అయితే బాగుంటుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతుండటం పార్టీలో కాకపుట్టిస్తోంది. మరోవైపు మంత్రి పదవులపై ఆశతో పలువురు నేతలు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఢిల్లీ విమానమెక్కేశారని అంటున్నారు. చివరి ప్రయత్నంగా తమ అదృష్టం పరీక్షించుకోవాలని తహతహలాడుతున్నారు. దీంతో కాబోయే మంత్రులు ఎవరు? ఎవరికి ఏ శాఖ అనేది ఆసక్తిరేపుతోంది.
