Begin typing your search above and press return to search.

జూబ్లీ హిల్స్ తో పాటే గోషామహల్ కి ఉప ఎన్నిక ?

తాను ఎప్పటికీ బీజేపీ సభ్యుడిని కాను అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఇపుడు దీనిని తెలంగాణా బీజేపీలో పెద్దలు కొందరు అంది వచ్చిన అవకాశంగా చూస్తున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   6 July 2025 7:00 AM IST
జూబ్లీ హిల్స్ తో పాటే గోషామహల్ కి ఉప ఎన్నిక ?
X

తెలంగాణాలో వరసబెట్టి రెండు ఉప ఎన్నికలు రానున్నాయా అన్నది చర్చగా వస్తోంది. ఈ రెండూ విపక్ష పార్టీలకు చెందినవే కావడం విశేషం. ఈ మధ్యనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ నుంచి మూడవసారి వరుసగా గెలిచిన మాగంటి గోపీనాధ్ మృతి చెందడంతో ఆయన నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఇపుడు మరో ఉప ఎన్నిక కోసం చురుకుగా పావులు కదుపుతున్నారు అని అంటున్నారు. అది బీజేపీ తెలంగాణా నాయకులు అని చెబుతున్నారు. గోషా మహల్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఈ మధ్యనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు ఆ లేఖను బీజేపీ పెద్దలకు పంపుతూ స్పీకర్ కి పంపించి దాన్ని ఆమోదించుకోవాలని కూడా కోరారు.

తాను ఎప్పటికీ బీజేపీ సభ్యుడిని కాను అని ఆయన స్పష్టంగా చెప్పేశారు. దీంతో ఇపుడు దీనిని తెలంగాణా బీజేపీలో పెద్దలు కొందరు అంది వచ్చిన అవకాశంగా చూస్తున్నారు అని అంటున్నారు. రాజా సింగ్ కరడు కట్టిన హిందూ వాదిగా ఉన్నారు. అయితే ఆయన ప్రతీసారి బీజేపీ నాయకుల మీద పెద్దల మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు.

జనంలో ఆయనకు మంచి పేరు ఉంది. దాంతో గెలుస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలను ధిక్కరించడంతోనే ఇబ్బంది అవుతోంది అని అంటున్నారు. ఆయన గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యల మీద పార్టీ చర్యలు తీసుకుంది. అలా ఆయన ఒకసారి సస్పెండ్ అయ్యారు. ఈసారి తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో హైకమాండ్ పోకడలను ప్రశ్నిచే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

అంతే కాదు పార్టీకే రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి వద్దు అనుకున్నారు. అయితే ఆయన కరడు గట్టిన హిందూత్వ వాది కావడంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఆయన విషయంలో ఏమి చేయాలని ఆలోచిస్తోంది. కానీ తెలంగాణా బీజేపీలో పెద్దలు మాత్రం రాజా సింగ్ ని పార్టీ నుంచి శాశ్వతంగా వదిలించేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారు. ఎటూ ఆయనే ఆయుధం ఇచ్చారు కాబట్టి ఆయన రాసిన లేఖనే స్పీకర్ కి పంపించి గోషామహల్ కి ఉప ఎన్నిక తీసుకుని రావాలని భావిస్తున్నారు.

దీని మీద కేంద్ర బీజేపీ పెద్దలకు తెలంగాణా బీజేపీ ముఖ్య నాయకుల నుంచి ఒక లేఖ తాజాగా వెళ్లినట్లుగా చెబుతున్నారు. రాజా సింగ్ పోకడలు పార్టీకి దాని వల్ల జరిగే నష్టాల గురించి అందులో వివరించడమే కాకుండా ఆయన రాజీనామాను ఆమోదించడంతో పాటు మాజీ ఎమ్మెల్యేగా చేయాలని కోరినట్లుగా చెబుతున్నారు.

ఈ లేఖ మీద కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తో పాటు తెలంగాణా కొత్త బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఇతర ముఖ్య నేతలు సంతకాలు చేసినట్లుగా చెబుతున్నారు. తెలంగాణా రాష్ట్ర బీజేపీ నేతల అభిప్రాయం కనుక ఈ విధంగా ఉంటే కేంద్ర నాయకత్వం కూడా అదే డిసైడ్ చేయవచ్చు అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఈ నెలాఖరులోగానే రాజా సింగ్ మాజీ ఎమ్మెల్యే అవుతారని అంటున్నారు. దాంతో జూబ్లీ హిల్స్ తో పాటు గోషా మహల్ కి కూడా ఒకేసారి ఉప ఎన్నికలు వస్తాయై అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.