బడ్జెట్ టైం : కేసీఆర్ వైపే అందరి చూపు
ఈసారి సమావేశాలలో అందరి దృష్టి బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీదనే ఉంది.
By: Satya P | 16 March 2026 9:43 AM ISTతెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మూడవ సారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో ఈసారి సమావేశాల్లో అధికార కాంగ్రెస్, విపక్షాల మధ్య వాడీ వేడీ చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈసారి సమావేశాలలో అందరి దృష్టి బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ మీదనే ఉంది.
సార్ వస్తున్నారా :
బడ్జెట్ సెషన్ కి కేసీఅర్ వస్తున్నారా అన్న చర్చ మొదలైంది. కేసీఆర్ గతసారి బడ్జెట్ సెషన్ కి వచ్చారు. తరువాత నుంచి మళ్ళీ హాజరు కాలేదు, హరీష్ రావు బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ గా కేటీఆర్ కీలక నేతగా అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని నడిపిస్తున్నారు దాంతో ఈసారి సమావేశాలకు కేసీఆర్ హాజరు మీదనే అందరి దృష్టి ఉంది. కేసీఆర్ విపక్షంలోకి వచ్చాక అసెంబ్లీకి వచ్చిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. ఆయన సభకు దూరంగానే ఉంటున్నారు. అయితే కేసీఅర్ సభకు హాజరు కావాలని నిర్మాణాత్మకమైన సలాహాలు సూచనలు ఇవ్వాలని అధికార కాంగ్రెస్ కోరుతోంది.
ఏపీలో వైసీపీ :
ఇక మరో పోలిక చూస్తే ఏపీలో విపక్ష నేత వైఎస్ జగన్ కూడా బడ్జెట్ సెషన్ కి మాత్రమే సభకు వస్తున్నారు. ఆ తరువాత ఆయనతో పాటు పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభకు దూరంగా ఉంటున్నారు. అయితే బీఆర్ఎస్ ఈ విషయంలో చాలా వరకూ నయం అన్న భావన ఉంది. కేసీఆర్ రాకపోయినా పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేలు సభకు హాజరవుతున్నారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే కేసీఆర్ జగన్ మాత్రం సభకు దూరంగా ఉండడం మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి.
కొత్త గవర్నర్ తొలి ప్రసంగం :
ఇక చూసుకుంటే ఈసారి బడ్జెట్ సెషన్ లో ముఖ్య అంశం కొత్త గవర్నర్ సభకు రావడం. శాసనసభ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా చేసే ప్రసంగంతో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత బడ్జెట్ సమావేశాల కాలపరిమితితో పాటు సభలో చర్చించాల్సిన ప్రధాన అంశాలను నిర్ణయించడానికి బీఏసీ సమావేశం జరగనుంది. ఇక ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 17 18 తేదీలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ చర్చించనుంది; మార్చి 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే సమాధానంతో ఈ చర్చ ముగుస్తుందని చెబుతున్నారు.
బడ్జెట్ మీద ఉత్కంఠ :
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇది మూడవ బడ్జెట్ కావడంతో అందరిలోనూ ఆసక్తి ఉంది. ఈసారి బడ్జెట్ లో ఏఏ రంగాలకు ఏంత కేటాయింపులు ఉంటాయన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆర్ధిక మంత్రిగా భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ నెల 20న ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కొన్ని భారీ ప్రాజెక్టులను చేపట్టడంతో పాటు ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఎల్ అండ్ టీ సంస్థ నుండి హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం వంటి కీలక అంశాలు గురించి బడ్జెట్ లో ప్రస్తావన ఉంటుందని అంటున్నారు. అలాగే ఒక వైపు సంక్షేమం మరో వైపు అభివృద్ధి మధ్య సమతుల్యతను పాటించేలా బడ్జెట్‌ను రూపొందించి ప్రవేశపెట్టడం ఆర్థిక మంత్రికి ఒక సవాలుగా మారనుందని చర్చ సాగుతోంది.
గ్యాస్ మీద రచ్చ :
ఇదిలా ఉంటే ఈసారి బడ్జెట్ సమావేశాల మీద గ్యాస్ ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడిందన్న ఆరోపణలకు సంబంధించి ప్రతిపక్షాలు సభలో రచ్చ చేస్తాయని అంటున్నారు. ప్రతిపాదిత మూసీ నదీ తీర అభివృద్ధి ప్రాజెక్టు విషయంలో అధికార కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ల మధ్య చర్చ తీవ్ర స్థాయిలో జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఇక ఈ నెల 30న బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత సభ వాయిదా పడనుందని చెబుతున్నారు.
