తెలంగాణ బీజేపీలో 'జీ హుజూర్(బాద్)'రగడ.. కేంద్ర మంత్రి వర్సెస్ ఎంపీ
ఎవరికైనా పార్టీతోనే విజయాలు వస్తాయని.. వ్యక్తిగత విజయాలు కాదని ఆయన పేర్కొనడం వైరి వర్గం నేతలను ప్రత్యేకంగా హెచ్చిరించినట్లు చెబుతున్నారు.
By: Tupaki Desk | 19 July 2025 8:00 AM ISTమొన్నటివరకు అధ్యక్ష ఎన్నికల పీటముడి.. ఏడాది ప్రతిష్ఠంభన అనంతరం ఎట్టకేలకు కొత్త చీఫ్ నియామకం జరిగిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో తెలంగాణ బీజేపీలో మళ్లీ రగడ మొదలైంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడ్డ ఇద్దరు నాయకుల వర్గాల మధ్య వివాదం ముదురుతోంది... కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడు.. ఎంపీ సొంత నియోజకవర్గంలో నాయకత్వం గురించి వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. వచ్చే స్థానిక ఎన్నికలను ఆలోచనలో పెట్టుకుని.. పార్టీ కోసం, ప్రధాని మోదీ కోసం పనిచేయాలని, వ్యక్తుల కోసం కాదంటూ ఆ నాయకుడు కోరారు. తన వైరి వర్గం నాయకుడి నియోజకవర్గం గురించే ఈ వ్యాఖ్యలు కావడం గమనార్హం. ఎవరికైనా పార్టీతోనే విజయాలు వస్తాయని.. వ్యక్తిగత విజయాలు కాదని ఆయన పేర్కొనడం వైరి వర్గం నేతలను ప్రత్యేకంగా హెచ్చిరించినట్లు చెబుతున్నారు.
ఇది ఇలా ఉండగా.. కేంద్ర మంత్రి వ్యాఖ్యల అనంతరం.. వైరి వర్గం నాయకుడి ప్రధాన అనుచరుడు రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఈయన అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కావడం పరిశీలించదగిన విషయం. దీంతో ఆ నియోజకవర్గం బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కినట్లైంది.
20 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం వదిలి గత ఏడాది వేరే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన నాయకుడి వర్గాన్ని కేంద్ర మంత్రి అవమానిస్తున్నారని, తొక్కేస్తున్నారని రాజీనామా చేసిన నాయకుడు ఆరోపించారు. ఏ కార్యక్రమమైనా కేంద్ర మంత్రి వర్గానికే ప్రాధాన్యం దక్కుతోందని, పార్టీ మారి వచ్చిన తాము అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని... ప్రత్యర్థి వర్గీయులకు టికెట్లు దక్కకుండా చేస్తానని కేంద్ర మంత్రి సంకేతాలు పండడంతో వ్యవహారం ముదిరి పాకాన పడింది.
మరోవైపు కేంద్ర మంత్రి తీరుతో తమకు వచ్చే స్థానిక ఎన్నికల్లో స్థానం దక్కదని ఎంపీ వర్గం నేతలు ఉండగా... వారి ఏరివేతపై వ్యూహం పన్నుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవలే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తి కావడంతో ఈ వర్గం వేగం పెంచింది. ఎంపీ తరఫున పనిచేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఎంపీకి కుట్రదారు అనే పేరు పెట్టిన ప్రత్యర్థులు.. ఆయనపై సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో చేసేందుకు వ్యూహం రచిస్తున్నారు. ఈ రగడ ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.
