Begin typing your search above and press return to search.

ఎంపీ పదవి ఒక్కటే కుదరదు.. పదవి కోసం ఈటల తీవ్ర ప్రయత్నాలు?

బీజేపీలో చేరిన నుంచి ఈటల రాజేందర్ ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోందని అంటున్నారు. ఏ ముహూర్తాన ఆయన బీజేపీ గూటికి చేరారో కానీ.. ఆశించిన ఏ పదవి దక్కట్లేదని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   28 July 2025 10:00 PM IST
ఎంపీ పదవి ఒక్కటే కుదరదు.. పదవి కోసం ఈటల తీవ్ర ప్రయత్నాలు?
X

తెలంగాణ బీజేపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో కీలక నేతలైన కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మధ్య విభేదాలతో కమలం పార్టీలో కలకలం ఏర్పడింది. ఒకే ఈ జిల్లాకు చెందిన ఈ ఇద్దరి మధ్య చాలాకాలంగా జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం కొద్ది రోజుల క్రితం బహిర్గమైంది. దీంతో పార్టీ పెద్దలతో తాడోపేడో తేల్చుకోవాలని సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ లో ఉండగా, తనతో చర్చించిన బీజేపీ పెద్దలు కీలక బాధ్యతలు అప్పగించి పార్టీలో చేర్చుకున్నారని, పార్టీలో చేరిన తర్వాత ఆ ఊసు ఎత్తకుండా తప్పించుకుంటున్నారని ఈటల ఆవేదన చెందుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకోవాలన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లు చెబుతున్నారు.

పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు

బీజేపీలో చేరిన నుంచి ఈటల రాజేందర్ ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోందని అంటున్నారు. ఏ ముహూర్తాన ఆయన బీజేపీ గూటికి చేరారో కానీ.. ఆశించిన ఏ పదవి దక్కట్లేదని చెబుతున్నారు. పార్టీలో చేరిన ఏడాదికే రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు ఈటల. కానీ అప్పుడు అధ్యక్ష పదవి కాకుండా ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా నియమించిన అధిష్టానం తాత్కాలికంగా సంతృప్తి పరిచింది. ఇక అదేసమయంలో సీఎం అభ్యర్థిగా రెండు చోట్ల పోటీ చేసిన ఈటల ఎక్కడా గెలవకపోవడంతో రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. అయితే వెంటనే తేరుకుని పార్లమెంటు సభ్యుడిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ గెలుపుతో సీనియర్ నేతగా కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్ అయిన ఈటల కన్నా, పార్టీలో సీనియర్ నేతలకే అవకాశాలు ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతో మళ్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించారు ఈటల. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో ఈటలను కాదని సంఘ్ నేపథ్యం ఉన్న రామచంద్రరావుకు అవకాశం ఇచ్చింది పార్టీ హైకమాండ్. ఫలితంగా సీనియర్ నేత ఈటలలో అసంతృప్తి పెరిగిపోతోందని అంటున్నారు.

కేంద్ర మంత్రి బండిపై గుస్సా..

ఆల్‌మోస్ట్ ప్రెసిడెంట్.. ప్రకటనే ఆలస్యమన్న భావనలో ఉన్న ఈటలకు లాస్ట్ మూమెంట్‌లో నిరాశ ఎదురైంది. దీనికి పార్టలో కొందరు నేతలు కారణమని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కేంద్రమంత్రి బండి సంజయ్ పార్టీలో తనకు చెక్ చెబుతున్నట్లు ఈటల అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు. ఈటలకు బదులుగా కేంద్రమంత్రి అయిన బండి సంజయ్‌ ఇప్పుడు ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకుండా అడ్డుకుంటున్నారని ఈటల అనుచరులు ఆరోపిస్తున్నారు. దాదాపు పదేళ్లపాటు జిల్లా రాజకీయాలను శాసించిన ఈటలకు ఈ పరిణామాలు రుచించడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తన ప్రభావం లేకుండా చేయాలనే ప్లాన్ లో భాగంగానే బండి సంజయ్ తనకు పదవి రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన అనుమానిస్తున్నట్లు చెబుతున్నారు.

బండిపై ఈటలకు కోపం..

అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్‌లో ఈటల ఓడిపోవడం పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో పోటీ చేసి గెలవడంతో ఈటల ఎక్కువగా తన పార్లమెంటు సెగ్మెంట్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సేమ్‌టైమ్‌ బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీగా తన పార్లమెంట్ పరిధిలోని హుజురాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఒకప్పటి తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో పట్టు కోసం బండి సంజయ్ ప్రయత్నం చేయడం ఈటలకు నచ్చడం లేదని చెబుతున్నారు. తనకే కాకుండా తన వర్గం నేతలకు కూడా పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు. అందుకే బండి సంజయ్‌తో పవర్ బ్యాలెన్స్ చేయాలని అధిష్టానం ముందు ప్రతిపాదన పెడుతున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే అమాత్య పదవి కానీ.. లేనిపక్షంలో జాతీయ స్థాయిలో పార్టీ పదవి అయినా కట్టబెట్టాలని అడుగుతున్నారట. జాతీయ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పవర్ బ్యాలెన్స్ చేయాలని కోరుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

మూడో మంత్రి సాధ్యమా?

ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. దీంతో తెలంగాణకు మూడో మంత్రి పదవి ఇస్తారా అన్నది డౌటే అంటున్నారు. లేకపోతే ఆ ఇద్దరిలో ఒకరిని తప్పించాల్సివుంటుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది అయ్యే పని కాదంటున్నారు. ఇక జాతీయ పార్టీలో ఈటల కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. ఎంపీ డీకే అరుణ జాతీయ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కేంద్రమంత్రి అయినా కూడా బండి పార్టీ పరంగా జాతీయ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌లో కొనసాగుతున్నారు. అయితే ఒకవేళ ఈటల కోరుకున్నట్లు జాతీయ స్థాయిలో పార్టీ కీలక పదవి ఇవ్వాలనుకుంటే మాత్రం బండి సంజయ్‌ ని జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించి ఈటల రాజేందర్‌కు ఇవ్వొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఈటలకు నేషనల్‌ పార్టీలో మంచి బెర్త్ ఇచ్చి బండి, ఈటల మధ్య పవర్ బ్యాలెన్స్ చేసి సయోధ్య కుదుర్చే అవకాశం ఉందని బీజేపీ ఆఫీస్‌లో చర్చ జరుగుతోంది.