మీకు పల్సర్, కేటీఎం బైక్స్ ఉన్నాయా? అయితే ఇది తప్పక చదవండి
ఖరీదైన పల్సర్, కేటీఎం బైక్స్ మాత్రమే దొంగిలిస్తూ, ఆ డబ్బుతో గంజాయి వ్యాపారం చేస్తున్న ఓ దొంగ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు.
By: Tupaki Desk | 30 Oct 2025 3:26 PM ISTఖరీదైన పల్సర్, కేటీఎం బైక్స్ మాత్రమే దొంగిలిస్తూ, ఆ డబ్బుతో గంజాయి వ్యాపారం చేస్తున్న ఓ దొంగ పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ దొంగ.. ఏపీలోని విజయవాడ, గుంటూరుతోపాటు పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఖరీదైన వాహనాలను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. అర్ధరాత్రి సమయంలో వచ్చి తాళం వేసి ఉన్నప్పటికీ పల్సర్, కేటీఎం బైకులను దొంగిలిస్తున్నాడు. డిజిటల్ లాకులను సైతం సులువుగా తెరుస్తున్న అతడు క్షణాల్లో మాయమై ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లో అమ్మేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
విజయవాడలో పదుల సంఖ్యలో వాహనాలు దొంగిలించిన ఆ దొంగ అల్లూరి సీతారామరాజు జిల్లా డొండకరాయి వద్ద పోలీసుల చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు చెబుతున్నారు. మోస్ట్ వాంటెడ్ అయిన ఈ దొంగ అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఖరీదైన వాహనాలను దొంగిలిస్తూ పోలీసులకు ముప్పతిప్పలు పెడుతున్నాడని అంటున్నారు. అతడికి ఖరీదైన దిచక్ర వాహనాలు అంటే చాలా ఇష్టమని, ఎంపిక చేసిన వాహనాలను మాత్రమే దొంగలిస్తాడని పోలీసులు చెబుతున్నారు.
పల్సర్, కేటీఎం వంటి వాహనాలను అతడు ఈజీగా మాయం చేస్తున్నాడని, వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటినే ఎక్కువ టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నాడు. ముందుగా రెక్కీ చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చి క్షణాల్లో మాయం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 23న విజయవాడలో ఒకే ప్రాంతంలో మూడు వాహనాలను దొంగిలించాడని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. నగరంలోని దాదాపు 11 వాహనాలను చోరీ చేయడం వెనుక అతడి పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇటీవల విజయవాడలో దొంగతనం చేసిన వాహనంతో అల్లూరి జిల్లాకు వెళ్లిన దొంగను డొంకరాయి వద్ద పోలీసుల సాధారణ తనిఖీల్లో పట్టుకున్నారు. రికార్డులు చూపించమని అతడిని పోలీసులు అడగడంతో బండిలో ఉన్నాయని తీసి తెస్తానని చెప్పి ఉడాయించాడు. వాహనం రిజిస్ట్రేషన్ నెంబరు ఆధారంగా అది విజయవాడకు చెందినదిగా గుర్తించిన పోలీసులు సమాచారం చేరవేశారు. కాగా, డొంకరాయిలో వాహనం లభ్యమైన తర్వాత పోలీసులు దొంగ విషయమై లోతుగా దర్యాప్తు చేయగా, ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తున్న దుండగుడు వాటిపై ఏజెన్సీ ప్రాంతానికి వస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ వస్తు మార్పిడి విధానం కింద బండిని ఇచ్చి ప్రతిగా గంజాయి తీసుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు లక్ష, లక్షన్నర రూపాయల ఖరీదైన వాహనాలను రూ.20 వేల నుంచి రూ.50 వేలకే ఇచ్చేస్తున్నాడని ప్రతిగా 10 కిలోల నుంచి 50 కిలోల గంజాయి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. గంజాయి తీసుకున్న తర్వాత అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా నగరానికి రహస్యంగా వచ్చి కిలో రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. డొంకరాయి పోలీసుల సమాచారంతో నగరంలో దొంగ కదలికలపై పోలీసులు నిఘా పెంచారని చెబుతున్నారు.
