ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యూటీ సీఎం ఫొటో.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది.
By: Tupaki Political Desk | 23 Feb 2026 6:55 PM ISTతెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బాధ్యతలు చూస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఆయనను గౌరవాన్ని మరింత పెంచేలా సీఎం రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటోతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోను కూడా ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటో ఏర్పాటు చేయాలనే నిర్ణయం తెలంగాణలో విస్తృత చర్చకు దారి తీస్తోంది. రాష్ట్రంలో ఇది వరకు ఇలాంటి సంప్రాదయం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన రెండేళ్ల తర్వాత ఈ ఆలోచనకు రావడం ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రుల ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంటాయి. కానీ, ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఈ కొత్త సంప్రదాయానికి నాంది పలికింది. ఏపీలో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ సీఎం చంద్రబాబు ఫొటోతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో పెట్టాలని ఆ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలేనే ఆదేశాలు జారీ అయ్యాయి.
ఏపీలో ఇప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వాధినేత ఫొటో పక్కన ఉప ముఖ్యమంత్రి ఫొటోలు ఎందుకంటూ ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కొత్త సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ తీర్పునివ్వాలని కోరారు. అయితే పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఉప ముఖ్యమంత్రుల ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండటం వల్ల నష్టమేంటి? అంటూ పిటిషనర్లను ప్రశ్నించింది. ఆ పిటిషన్ పై విచారణ టైం వేస్ట్ గా వ్యాఖ్యానించింది.
దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలన్న ఆలోచనకు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. కోర్టు నుంచి చిక్కులు కూడా ఎదురయ్యే అవకాశం లేకపోవడంతో దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చించి విధాన నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీ మాదిరిగా తెలంగాణలో కూడా ఉప ముఖ్యమంత్రి ఫొటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలనే ఆలోచన ముందుగా ఎవరికి వచ్చిందన్న దానిపై క్లారిటీ దొరకలేదు. కేబినెట్ సమావేశం తర్వాత ప్రభుత్వం దీనిపై ప్రకటన చేస్తే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
