తెలంగాణ రాజకీయాలు.. హెల్దీ రాజకీయాలు!
రాజకీయం అంటే ప్రజల కోసం, ప్రజాసేవ కోసమన్న భావన క్రమంగా కనుమరుగవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కనిపించిన అరుదైన దృశ్యం ఆశాజనకంగా, మార్పుకు నాంది పలికేలా ఉంది.
By: Tupaki Desk | 16 July 2025 5:01 PM ISTనేటి రాజకీయ సంస్కృతి రోజురోజుకూ దిగజారిపోతోందని, వ్యక్తిగత దూషణలు, ఘాటైన వ్యాఖ్యలు సర్వసాధారణమైపోయాయని మనం నిత్యం చూస్తున్నాం. రాజకీయం అంటే ప్రజల కోసం, ప్రజాసేవ కోసమన్న భావన క్రమంగా కనుమరుగవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కనిపించిన అరుదైన దృశ్యం ఆశాజనకంగా, మార్పుకు నాంది పలికేలా ఉంది.
-అసెంబ్లీలో అరుదైన దృశ్యం
తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అప్పట్లో అసెంబ్లీలో ఒక విశేషమైన సంఘటన చోటుచేసుకుంది. అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు, ప్రతిపక్ష నాయకులు, మాజీ మంత్రులు కలిసి ప్రజా సమస్యలపై చర్చించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సభ ప్రారంభానికి ముందు వీరంతా పక్కపక్కనే కూర్చుని, వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి అభివృద్ధి పనులు, పథకాల అమలు, ప్రజలకు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి వంటి ప్రతిపక్ష నేతలతో పాటు, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరిణామం సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ప్రజలు, నెటిజన్లు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-నెటిజన్ల స్పందన
"ఇదే కదా అసలైన ప్రజాస్వామ్యం.. ఇటువంటి స్నేహపూర్వక వాతావరణమే తెలంగాణ సమాజం కోరుకునేది" అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. "విమర్శలు అవసరమే.. కానీ అవి నిర్మాణాత్మకంగా ఉండాలి. వ్యక్తిగత విమర్శలు కాకుండా, ప్రజా సమస్యలపై పోటీపడే వాతావరణం రాజకీయాల్లో ఉండాలి" అని వారు సూచిస్తున్నారు. అలాగే "తెలంగాణ ఉద్యమంతో ఏర్పడిన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలంటే, రాజకీయ నాయకులు తమ ధోరణి మార్చుకోవాలి" అని వ్యాఖ్యానిస్తున్నారు.
-ప్రజాప్రతినిధులపై సమాజ ఆశలు
అసెంబ్లీలో కనిపించిన ఈ దృశ్యం ఒక చిన్న ఆరంభం మాత్రమే అయినా, రాజకీయాల్లో సంస్కృతి మారేందుకు ఇది ఒక గొప్ప నిదర్శనం. అధికార, ప్రతిపక్షాలు ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని కలిసి పనిచేయాలనే బలమైన సందేశం ఇక్కడి నుండి వెలువడుతోంది. ఇది రాజకీయాల్లో ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ కావాలని, ఇటువంటి భావోద్వేగాలతో కూడిన, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి అన్ని స్థాయిల రాజకీయాల్లో కొనసాగాలని ప్రజలు ఆశిస్తున్నారు.
తెలంగాణ అంటే ఉద్యమాల స్ఫూర్తి. ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి అంకితమైన మార్గదర్శకత్వం. ఆ రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు కూడా ఆ స్థాయిలో ప్రవర్తిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యానికి ప్రాణం పోస్తుంది. వ్యక్తిగత దూషణలకు దూరంగా ఉండి, ప్రజా సమస్యల పరిష్కారంలో పోటీ పడే రాజకీయ పటిమను ప్రదర్శించాలి. ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు కోరుకునేది మర్యాదపూర్వక రాజకీయ సంస్కృతి అని గుర్తించాలి. తెలంగాణలో ప్రారంభమైన ఈ మంచి మార్పు దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆశిద్దాం.
