బడ్జెట్ సమావేశాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్.. రీజనేంటి?
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆదివారం సభల తీవ్ర గందరగోళం.. అధికార.. ప్రధాన ప్రతిప క్షాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది.
By: Garuda Media | 30 March 2026 12:03 AM ISTతెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆదివారం సభల తీవ్ర గందరగోళం.. అధికార.. ప్రధాన ప్రతిప క్షాల మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విపక్ష సభ్యులు స్పీకర్ పోడియంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. దీంతో మార్షల్స్‌ను పిలిచిన స్పీకర్.. ప్రతిపక్ష బీఆర్ ఎస్ సభ్యులను సభ నుంచి బలవంతంగా బయటకు పంపించారు. అనంతరం.. బీఆర్ ఎస్ సభ్యులు అందరిపైనా.. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు. ఇలా.. ప్రతిపక్షంపై పూర్తిగా సస్పెన్షన్ వేటు వేయడం ఇదే తొలిసారి.
ఏం జరిగింది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమాలకు పాల్పడుతోందని.. దీనిపై హౌస్ కమిటీని వేసి విచారణ చేయాలని బీఆర్ ఎస్ సభ్యులు గత రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. దీనికి ప్రతిగా.. మాజీ మంత్రి బీఆర్ ఎస్ సభ్యుడు హరీష్‌రావు కుటుంబం అక్రమాలకు పాల్పడు తోందని.. అధికార పక్షం ఆరోపించింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి హరీష్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక, ఆదివారం ఈ వ్యవహారం మరింత దుమారం రేపింది.
రాఘవ కంపెనీపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. హౌస్ కమిటీని వేయాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ మరింత పట్టుబిగించింది. ఈ క్రమంలో గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ వరకు పాదయాత్రగా వచ్చారు. అనంతరం.. సభలో ఈ విషయంపై చర్చకు హౌస్ కమిటీకి పట్టుబట్టారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం కాళేశ్వరం సహా.. ఇతర అంశాలను లేవనెత్తింది.
సర్కారు వాదన ఇది..
ఆరోపణలు వచ్చిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీపై సీఐడీ విచారణకు ఆదేశించామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. సీఐడీ విచారణకు ఆదేశించిన తర్వాత.. హౌస్ కమిటీ విచారణ కోరడంలో ఎలాంటి నైతికతా లేదని బీఆర్ ఎస్‌ను విమర్శించారు. ఈ క్రమంలో మంత్రి హరీష్‌రావు.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభలోనే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా.. అటు అధికార, ఇటు ప్రధాన ప్రతిపక్షాల మధ్య పరస్పర అవినీతి ఆరోపణలు మిన్నంటాయి. పోడియంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేసిన.. హరీష్‌రావును మార్షల్స్ బలవంతంగా బయటకు పంపించారు. అనంతరం.. మొత్తం బీఆర్ ఎస్ సభ్యులపై బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు వేశారు.
