Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో దేశంలోనే టాప్

ఇదివరకు అభివృద్ధి రేటులో దూసుకుపోయిన ఈ రెండు రాష్ట్రాలు, తాజాగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి

By:  Tupaki Desk   |   13 April 2025 8:00 PM IST
తెలుగు రాష్ట్రాలు  ఈ విషయంలో దేశంలోనే టాప్
X

తెలుగు రాష్ట్రాలు మరోసారి తమ సత్తాను చాటుకున్నాయి. ఇదివరకు అభివృద్ధి రేటులో దూసుకుపోయిన ఈ రెండు రాష్ట్రాలు, తాజాగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. దేశంలో నమోదైన అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిణామం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, దేశ సగటు ద్రవ్యోల్బణం 3.61 శాతంగా ఉంది. అయితే తెలంగాణలో కేవలం 1.31 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 2.44 శాతం ద్రవ్యోల్బణం మాత్రమే నమోదవ్వడం విశేషం. అంతేకాదు కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఏపీ కంటే స్వల్పంగా 2.27 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. మరోవైపు, అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా కేరళ (7.31 శాతం) నిలవడం గమనార్హం.

ఈ ఫలితాలు తెలుగు రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా పేరు తెచ్చుకోవడం గమనార్హం. కానీ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2023 డిసెంబర్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తీసుకున్న చర్యలు ఫలితంగా ఇప్పుడు తెలంగాణ దేశంలోనే అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా అవతరించింది.

ఈ విజయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆపాదించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సేవలు, రేషన్ షాపుల్లో సన్నబియ్యం వంటి పథకాలే ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం నుంచి అత్యల్ప ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారిన ప్రయాణం నిజంగా అద్భుతమని చెప్పవచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు, రాజధాని లేకపోవడం, వైసీపీ పాలనలో పెరిగిన అప్పుల భారం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయితే, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం పది నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిందని చెప్పవచ్చు. సుమారు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడం, రిలయన్స్ వంటి సంస్థలు బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం వంటి చర్యల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఊపందుకుంది. అంతేకాకుండా, ఎన్నికల హామీల మేరకు పెన్షన్లను రూ.4 వేలకు పెంచడం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు ఆర్థిక భరోసా లభించింది. ఈ చర్యల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండో అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా నిలిచింది.

మొత్తానికి తెలుగు రాష్ట్రాలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సాధించిన విజయం దేశానికే ఒక గొప్ప ఉదాహరణ. గతంలో ఆర్థికంగా వెనుకబడిన పరిస్థితులు ఉన్నప్పటికీ, సరైన విధానాలు .. సమర్థవంతమైన పాలన ద్వారా ఈ రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థికంగా స్థిరమైన స్థానానికి చేరుకున్నాయి. ఈ పరిణామం రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ఆశిద్దాం.