Begin typing your search above and press return to search.

గోవిందా.. గోవిందా.. శ్రీవారి పేరుతోనే బెట్టింగ్ యాప్స్.. మంత్రి లోకేశ్ డేరింగ్ డెసిషన్

అన్వేష్ పోస్టుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బెట్టింగు యాప్స్ పేద, అమాయక ప్రజలను ఎలా ఛిదిమేస్తున్నారో తనకు తెలుసన్నారు.

By:  Tupaki Desk   |   18 April 2025 6:20 PM IST
గోవిందా.. గోవిందా.. శ్రీవారి పేరుతోనే బెట్టింగ్ యాప్స్.. మంత్రి లోకేశ్ డేరింగ్ డెసిషన్
X

ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. ఆన్ లైన్ వేదికగా ఈజీ మనీ ఆశ చూపి యువతను బలి తీసుకుంటున్నాయి. దీంతో కొద్ది రోజులుగా ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేష్’ బెట్టింగు యాప్ లపై యుద్ధం కొనసాగిస్తున్నాడు. తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ సైతం బెట్టింగ్ యాప్ లపై వార్ ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలకు నోటీసులు పంపింది. దీంతో కొంతవరకు బెట్టింగు యాప్స్ జోరు తగ్గినట్లు కనిపించినా, నా అన్వేష్ పోరాటం ఆపలేదు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి నామంతోనే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నట్లు ఆయన తాజాగా బయటపెట్టాడు. అంతేకాకుండా తన పోరాటానికి మద్దతు ప్రకటించాల్సిందిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, యువనేత లోకేశ్ లను ట్యాగ్ చేశాడు. దీంతో ఇప్పుడు ఏపీలోనూ బెట్టింగ్ యాప్స్ పై చర్చలు షురూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శ్రీవెంకటేశ్వరుడుని స్తుతించే ‘గోవింద’ పేరుతో ఆన్ లైన్ లో బెట్టింగు యాప్ నిర్వహిస్తున్నట్లు యూట్యూబర్ అన్వేష్ రెండు రోజుల క్రితం బయటపెట్టాడు. అంతేకాకుండా ఈ యాప్ కు సినీ నటి తమన్నాతోపాటు మరికొందరు ప్రమోటర్లుగా ఉన్న విషయాన్ని వెల్లడించాడు. దీనిపై ఓ వీడియో చేసి తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేయడమే కాకుండా ఏపీ ప్రభుత్వంలోని కీలక నేతలు పవన్ కల్యాణ్, లోకేశ్ లను ట్యాగ్ చేశాడు. దీంతో గోవింద బెట్టింగు యాప్ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. యూట్యూబ్, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాతోపాటు ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా ‘గోవింద’ అనే బెట్టింగు యాప్ నిర్వహిస్తూ అమాయకులను దోచేస్తున్నారని అన్వేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.

అన్వేష్ పోస్టుపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. బెట్టింగు యాప్స్ పేద, అమాయక ప్రజలను ఎలా ఛిదిమేస్తున్నారో తనకు తెలుసన్నారు. బెట్టింగ్ యాప్ప్ నియంత్రణకు కూటమి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని, ఈ విషయంలో దేశానికే ఆదర్శవంతమైన పాలసీని త్వరలో తీసుకువస్తామని మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడుతున్నారు. నేను వందలాది హృదయ విదారక గాథలను వింటున్నాను. ఇది ఆపాలి. దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటంటే నిరంతర అవగాహన, బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడం. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానం తీసుకువచ్చేందుకు మేము కృషి చేస్తున్నాము.’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

దీంతో తెలంగాణతోపాటు ఏపీ ప్రభుత్వం కూడా బెట్టింగు యాప్స్ అంతు తేల్చేందుకు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాను మంచికే వాడుదామంటూ యుద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. సోషల్ సైకోలపై ఉక్కుపాదం మోపుతోంది. దీనికి తోడుగా బెట్టింగ్ మాఫియాను తుదముట్టించేందుకు ఏపీ పోలీసులు రంగంలోకి దిగితే మోసగాళ్ల ఆటకట్టే అవకాశం ఉందంటున్నారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ ఉమ్మడిగా బెట్టింగు యాప్స్ పై పనిచేయాల్సిన అవసరం ఉందని సూచనలు వస్తున్నాయి.