బాబు రేవంత్ భేటీ...ఇరు రాష్ట్రాలకూ శుభకరమేనా ?
పదకొండేళ్ళ క్రితం వరకూ ఒక్కటిగా ఉండేది ఆంధ్ర ప్రదేశ్. విభజన తరువాత వేరు పడినా అన్నదమ్ములుగా ఉందామనుకుంది.
By: Tupaki Desk | 17 July 2025 9:25 AM ISTపదకొండేళ్ళ క్రితం వరకూ ఒక్కటిగా ఉండేది ఆంధ్ర ప్రదేశ్. విభజన తరువాత వేరు పడినా అన్నదమ్ములుగా ఉందామనుకుంది. అయితే రెండు రాష్ట్రాలలో జల వివాదాలు ఒక కఠిన పరీక్షను పెడుతున్నాయి. తెలంగాణా ఉద్యమం నీటి సెంటిమెంట్ తోనే వచ్చింది. దాంతో నీటి విషయంలో ఏ విధంగా అడుగు ముందుకు వేసినా దాన్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అలా రాజకీయంగానూ ఇబ్బందులు వస్తాయన్న భయాలు తెలంగాణాలో ఉన్నాయి.
అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చాక ఏపీ తెలంగాణాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు అవుతుందన్న ఆశలు అయితే అందరిలో ఉన్నాయి. తొలి భేటీ తెలంగాణా ప్రగతిభవన్ లో రేవంత్ రెడ్డి చంద్రబాబు గత ఏడాది నిర్వహించారు.
ఆ సమావేశం తరువాత మళ్ళీ కలిసింది లేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఢిల్లీలో కేంద్ర పెద్దల సమక్షంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. చర్చల ద్వారానే ఎంతటి జఠిల సమస్యలు అయినా పరిష్కారం లభిస్తుందని తెలంగాణా ఏపీ రెండూ నమ్ముతున్న వేళ ఈ భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ పాల్గొన్నారు. అలాగే ఏపీకి చెందిన జనలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కూడా హాజరయ్యారు.
ఈ భేటీలో ప్రధానంగా కృష్ణా నది నిర్వహణ బోర్డు అమరావతిలో, గోదావరి నది నిర్వహణ బోర్డు హైదరాబాద్‌లోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అదే విధంగా రెండు రాష్ట్రాలు సమర్పించిన ప్రతిపాదనలలోని సాంకేతిక అంశాలపై సైతం సమగ్రమైన చర్చ సాగింది అని నిమ్మల రామానాయుడు అంటున్నారు. అంతే కాదు ఈ సమావేశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జల సమస్యల పరిష్కారానికి ఒక శుభ పరిణామంగా రెండు రాష్ట్రాల పెద్దలూ భావించడం కీలక పరిణాంగానే చూడాలని చెప్పారు.
అంతే కాదు ఇరు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు లబ్ధి చేకూర్చే ఒప్పందానికి చేరుకోవాలని లక్ష్యంగా ఈ తొలి భేటీ సాగింది మరో వైపు చూస్తే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం లోపు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం ఈ సమావేశంలో తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇక ఈ సమావేశం మీద తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాజా సమావేశంలో బనకచర్ల అంశంపై చర్చ జరగలేదని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాల విషయంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే అధికారులు, ఇంజినీర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా ఆయన వెల్లడించారు.
అదే విధంగా గతంలో కేసీఆర్ తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కేంద్రం ఎవరి పక్షాన మాట్లాడలేదని, కేవలం సమన్వయకర్త పాత్ర మాత్రమే పోషించిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ కలసి కూర్చుని చర్చించాలనుకోవడం సగం విజయంగా చెబుతున్నారు.
రానున్న రోజులలో ఈ తరహా సమావేశాలు మరిన్ని సాగితే కనుక గోదావరి, కృష్ణా నది నీటిని ఎలా పంచుకోవాలో అన్న దాని మీద ఒక స్పష్టత వస్తుంది. రెండు రాష్ట్రాలు తమ రైతులకు న్యాయం చేయడానికి సిద్ధపడడం కూడా మేలైన పరిణామంగా ఉంటుందని అంటున్నారు. నీటి వనరులపై ఆధారపడిన ప్రజలకు రైతాంగానికి భారీ ప్రయోజనం చేకూర్చే న్యాయమైన ఒప్పందాన్ని ఏపీ తెలంగాణా కుదుర్చుకోవాలని ఇద్దరూ ఇందులో విజయం సాధించాలని అంతా ఆశిస్తున్నారు.
