ఏపీ వర్సెస్ తెలంగాణ: జల వివాదాలు.. కొన్ని చిక్కులు!
ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మూడు సమస్యలు ఉన్నాయి. వీటిపైనే ఇప్పుడు పోరు సాగు తోంది.
By: Tupaki Desk | 15 July 2025 3:00 PM IST''రాష్ట్రం విడిపోతే.. నీటి యుద్ధాలు వస్తాయి. ఇది రాసిపెట్టుకోండి!'' అని ఉమ్మడి రాష్ట్ర చిట్టచివరి ముఖ్య మంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. అయితే.. ఆయన చెప్పినంత కాకపోయినా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నా యి. ఎప్పటికప్పుడు సమస్యలు పెరుగుతూనే పోతున్నాయి. అయితే.. దీనికి రాజకీయాలు కూడా తోడు కావడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయన్నది వాస్తవం.
ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మూడు సమస్యలు ఉన్నాయి. వీటిపైనే ఇప్పుడు పోరు సాగుతోంది. 1) కీలకమైన కృష్ణానదిపై నిర్మించిన నాగార్జున సాగర్‌లో తమకు ఎక్కువ కేటాయింపులు కావాలని తెలంగాణ కోరుతోంది. కానీ.. దీనికి ఏపీ ససేమిరా అంటోంది. అంతేకాదు.. తెలంగాణ ప్రభుత్వం తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నది ఏపీ వాదన. కానీ, తెలంగాణ మాత్రం.. తమకు ఆ హక్కు ఉందని వాదిస్తోంది. ఇది 2019-24 మధ్య పోలీసులు తన్నుకునే వరకు కూడా వచ్చింది.
2) రాష్ట్ర విభజనకు ముందు.. బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు జరిపింది. అప్పట్లో ఉమ్మడి గా ప్రాజెక్టులను నిర్ణయించి.. నీటి కేటాయింపులు చేసింది. కానీ.. తెలంగాణ విడిపోయిన తర్వాత.. కొత్తగా నిర్మించే ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేకుండా పోయాయి. ఇది ప్రధాన సమస్యగా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటోంది. పైగా.. గత సీఎం కేసీఆర్.. కృష్ణాలో తమకు 42 శాతం వాటా చాలని సంతకాలు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ వాటాను తమకు 52 శాతం వాటా చేయాలన్నది ఆయన వాదన. దీంతో కొత్తగా ప్రాజెక్టులు కట్టుకునేందుకు అవకాశం ఉంటుందని.. ఉన్నవాటికి నీటి కేటాయింపులు కూడా ఎరుగుతాయని ఆయన వాదిస్తున్నారు.
3) బనకచర్ల(గతంలో సీమ ఎత్తిపోతల) ప్రాజెక్టును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కానీ.. దీనిపై ఏపీ వాదన మరో విధంగా ఉంది. గోదావరిలో మిగిలే జలాలను, ముఖ్యంగా సముద్రంలో కలిసే జలాలను మాత్రమే తాము బనకచర్లకు పోలవరం నుంచి తరలిస్తామని చెబుతోంది. కానీ, అసలు మిగులు జలాల లెక్కతేల్చకుండా ఎలా తరలిస్తారన్నది తెలంగాణ వాదన. అంతేకాదు.. ప్రతి సంవత్సరం మిగులు ఉండదని.. అప్పుడు కూడా ఏపీ తరలించే అవకాశం ఉంటుందన్నది తెలంగాణ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ మూడు చిక్కులు తేలితే తప్ప.. రెండు రాష్ట్రాల మధ్య అంతో ఇంతో జల వివాదాలకు బ్రేక్ పడే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
