Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు: కవిత సంచలన ట్వీట్

ఈ పరిణామాల నేపథ్యంలో, కవిత అనుచరులు చేసిన హంగామా కూడా సంచలనం సృష్టించింది.

By:  Tupaki Desk   |   26 May 2025 11:15 PM IST
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు: కవిత సంచలన ట్వీట్
X

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఏసీబీ నోటీసులు కలకలం రేపాయి. ఫార్ములా-ఈ రేసు కేసులో గతంలో విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే, భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల వేడుకలకు అమెరికా వెళ్తున్న నేపథ్యంలో తనకు కాస్త సమయం కావాలని, తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించిన కేటీఆర్, ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు ఇస్తోందని మండిపడ్డారు.

కేటీఆర్ ఆగ్రహం:

కేటీఆర్ తన ట్వీట్‌లో మాట్లాడుతూ గతంలోనూ ఇదే కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చారని, అప్పుడు కూడా తాను విచారణకు హాజరయ్యానని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు నోటీసులు ఇచ్చినా, విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రతిపక్షాలను కేసుల పేరుతో వేధిస్తోందని ఆయన ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా బెదిరే ప్రసక్తి లేదని, తాను ధైర్యంగా ఎదుర్కొంటానని కేటీఆర్ ఉద్ఘాటించారు.

కవిత సంచలన ట్వీట్:

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. "ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదు. పైగా ఆ సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేయడం సరైన విధానం కాదు. ఇటువంటి వేధింపులు భారత రాష్ట్ర సమితి నాయకులకు కొత్త కాదు. ఇటువంటి ఇబ్బందులు ఎన్నైనా సరే ఎదుర్కొని, తట్టుకొని నిలబడిన శక్తి కేసీఆర్ సైనికులకు ఉందని" కవిత పేర్కొన్నారు.

కుటుంబంలో సయోధ్యకు సంకేతమా?

అయితే, ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల కల్వకుంట్ల కవిత రాసిన లేఖలు బయటికి వచ్చి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ లేఖల్లో పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయని, గులాబీ సుప్రీంను ప్రశ్నిస్తూ అనేక విషయాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కవిత అమెరికా నుంచి తిరిగి రావడానికి ఒకరోజు ముందు ఈ లేఖలు బయటికి రావడంతో, ఆమె తీవ్రంగా మండిపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తన తండ్రి దేవుడని, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్‌లో ఏదో జరుగుతోందనే ప్రచారం మొదలైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, కవిత అనుచరులు చేసిన హంగామా కూడా సంచలనం సృష్టించింది. కవిత లేఖల ఎపిసోడ్ బయటికి వచ్చిన మరుసటి రోజు కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించి, కవితను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ లైన్ దాటితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేటీఆర్ విలేకరుల సమావేశం అనంతరం కవిత అనుచరులు నిశ్శబ్దంగా ఉండిపోయారు. అయితే, నిన్న కవిత ప్రధాన అనుచరుల్లో ఒకరు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ మళ్లీ చర్చనీయాంశమైంది.

తాజాగా, కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ అయిన తర్వాత ఆయన సోదరి కవిత ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించడం, ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే, మొత్తంగా కుటుంబంలో ఏర్పడిన కోల్డ్ వార్ తగ్గినట్టు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన కేటీఆర్, కవిత మధ్య సయోధ్యకు సంకేతంగా భావించవచ్చని వారు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా, ఈ ఏసీబీ నోటీసుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేపే అవకాశం ఉంది.