ఫార్ములా ఈ కేసు : ఏ వన్ గా కేటీఆర్
తెలంగాణా రాజకీయాల్లో భారీ కుదుపు లాంటి పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఛార్జిషీట్ ని తాజాగా దాఖలు చేసింది.
By: Satya P | 24 March 2026 9:23 AM ISTతెలంగాణా రాజకీయాల్లో భారీ కుదుపు లాంటి పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఛార్జిషీట్ ని తాజాగా దాఖలు చేసింది. ఈ చార్జి షీటులో పేర్కొన్న దాని ప్రకారం చూస్తె ఏ వన్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పేరుని చేర్చారు. కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నపుడు ఫార్ములా ఈ రేసుకి సంబంధించి సరైన అనుమతులు లేకుండా విదేశీ సంస్థలకు 55 కోట్లను అక్రమంగా మళ్లించారనే ఆరోపణలపై ఏసీబీ ఈ కేసుని నమోదు చేసింది.
విచారించిన అనంతరం :
ఇక ఫార్ములా ఈ రేస్ లో భారీ స్కామ్ జరిగిందన్న ఆరోపణల మీద గతంలో ఏసీబీ కేటీఆర్ ని పిలిచి విచారించింది. అలాగే అనేక మందిని కూడా ఇదే కేసులో విచారించింది. ఇక తాజాగా ఏసీబీ దాఖలు చేసిన చార్జి షీటులో ఏ వన్ గా కేటీఆర్ నే పేర్కొనడం విశేషం. ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక 2023లో హైదరాబాద్ ఇ-ప్రిక్స్ నిర్వహణ సమయంలో విధానపరమైన నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయని ఏసీబీ పేర్కొంది. అంతే కాదు అక్రమ ఆర్థిక బదిలీలకు సంబంధించిన అంశాలు ఈ కేసులో చాలా ఉన్నాయని స్పష్టం చేస్తోంది.
ప్రధాన నిందితులుగా :
ఈ ఫార్ములా ఈ కేసు ఛార్జిషీట్ లో కీలక వివరాలు చూస్తే కనుక ప్రధాన నిందితులుగా కేటీఆర్ తో పాటు మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఏ 2గా, మాజీ హెచ్‌ఎమ్‌డిఎ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ని ఏ 3 గా, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఏ 4గా, యూకేకు చెందిన ఫార్ములా ఇ ఆపరేషన్స్ (ఎఫ్‌ఇఓ) ని ఏ 5గా పేర్కొంది. ఇక ఈ కేసులో ప్రధానమైన ఆరోపణలు ఏసీబీ వైపు నుంచి చూస్తే కనుక .
క్యాబినెట్ లేదా ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా సుమారు 55 కోట్ల నిధులను ఎఫ్‌ఈఓకు బదిలీ చేయాలని కేటీఆర్ ఆదేశించారని ఏసీబీ ఆరోపిస్తోంది.
ఏణ్ణర్ధంగా విచారణ :
ఈ కేసుని గత ఏణ్ణర్ధంగా విచారణ చేస్తున్న ఏసీబీ అనేక కీలక అంశాలను చార్జి షీటులో ప్రస్తావించి ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఇక ఈ కేసు విషయంలో నిబంధనల ఉల్లంఘన సైతం ఉందని ఏసీబీ పేర్కొంటోంది. 2023లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు, హెచ్‌ఎండిఏ నిధులను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వినియోగించి భారత ఎన్నికల సంఘం నుండి అనుమతి పొందకుండా విధానాలను ఉల్లంఘించి నిధులను బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి.
నేర పూరిత కుట్ర :
ఏసీబీ ఈ కేసు విషయంలో గవర్నర్‌తో సహా ప్రాసిక్యూషన్ అనుమతులు తీసుకుందని చెబుతున్నారు. అలా తుది ఆమోదాన్ని పొందిన మీదటనే ఏసీబీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిందని చెబుతున్నారు. అలాగే అవినీతి నిరోధక చట్టం పీసీ యాక్ట్ అలాగే ఐపీసీ సెక్షన్ల కింద నేరపూరిత కుట్ర అధికార దుర్వినియోగం కింద ఆరోపణలతో ఈ కేసుని ఏసీబీ నమోదు చేసింది. ఇదిలా ఉండగా ఈ కేసులో తన మీద వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవిగా కేటీయార్ ఇప్పటికి పలు మార్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ఫైల్‌పై సంతకాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే ఏ వన్ గా కేటీఆర్ పేరుతో ఏసీబీ చార్జి షీటు దాఖలు చేయడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగినట్లు అయింది అని అంటున్నారు.
