వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాలకు నిధుల వర్షం.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమతూకంలో ఉంచే ప్రయత్నం చేసింది.
By: A.N.Kumar | 20 March 2026 1:52 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ఒక దిక్సూచిలా కనిపిస్తోంది. మొత్తం ₹3,24,234 కోట్ల భారీ అంచనాతో రూపొందించిన ఈ పద్దు కేవలం అంకెల గారడీగా కాకుండా క్షేత్రస్థాయిలో సామాన్యుడి అవసరాలను తీర్చే ఒక సమగ్ర ప్రణాళికగా ఆవిష్కృతమైంది. అటు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఇటు మౌలిక వసతుల కల్పన ద్వారా దీర్ఘకాలిక అభివృద్ధికి బాటలు వేయడం ఈ బడ్జెట్ లోని ప్రధానాంశం.
గ్రామీణ భారతం.. అభివృద్ధికి పీఠం
దేశానికి వెన్నెముక రైతు అయితే రాష్ట్రానికి వెన్నెముక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. దీనిని గుర్తించిన ప్రభుత్వం పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖకు ₹33,688 కోట్లు కేటాయించడం శుభపరిణామం. 'పల్లె ప్రగతి' వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఉపాధి అవకాశాలను పెంచడం వల్ల పట్టణాలకు వలసలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయానికి మరియు సాగునీటి రంగానికి కలిపి దాదాపు ₹45,000 కోట్లకు పైగా నిధులు కేటాయించడం ద్వారా అన్నదాతకు భరోసా లభించింది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే సంకల్పం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది.
విద్య, వైద్యం.. రేపటి తరానికి పెట్టుబడి
ఏ సమాజమైనా అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అనేవి పునాదులు. ఈ బడ్జెట్‌లో విద్య రంగానికి ₹26,674 కోట్లు కేటాయించడం ఒక సాహసోపేతమైన ఆహ్వానించదగ్గ నిర్ణయం. డిజిటల్ విద్యను ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన చదువు అందుతుంది. అలాగే, వైద్య రంగానికి ₹13,679 కోట్లు కేటాయించడం ద్వారా సామాన్యుడికి ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అడుగులు పడ్డాయి.
సమతుల్యత – సామాజిక న్యాయం
బడ్జెట్‌లో కేవలం ఆర్థికాభివృద్ధే కాకుండా సామాజిక న్యాయానికి కూడా పెద్దపీట వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలనే లక్ష్యం నెరవేరుతుంది. ముఖ్యంగా ₹47,267 కోట్ల మూలధన వ్యయం అనేది రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, రోడ్లు, భవనాల నిర్మాణానికి ఊతమిస్తుంది. ఇది భవిష్యత్తులో ఆదాయ వనరులను పెంచడమే కాకుండా ఉపాధి కల్పనకు దారితీస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని సమతూకంలో ఉంచే ప్రయత్నం చేసింది. అయితే కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా, నిధుల విడుదల.. అమలులో పారదర్శకత వహించినప్పుడే ఈ బడ్జెట్ లక్ష్యం పూర్తిగా నెరవేరుతుంది. నిధుల సమీకరణలో సవాళ్లు ఎదురైనప్పటికీ వ్యయ నియంత్రణ పాటిస్తూ అనుకున్న లక్ష్యాలను సాధిస్తే తెలంగాణ 'రోల్ మోడల్'గా నిలవడం ఖాయం.
