Begin typing your search above and press return to search.

ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. కీలక ఫైళ్లు.. పత్రాలు మాయం!

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో పలు శాఖలకు చెందిన ఫైళ్లు.. కీలక పత్రాలు మాయం అవుతున్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 Dec 2023 6:01 AM GMT
ఒకటి తర్వాత ఒకటి చొప్పున.. కీలక ఫైళ్లు.. పత్రాలు మాయం!
X

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో పలు శాఖలకు చెందిన ఫైళ్లు.. కీలక పత్రాలు మాయం అవుతున్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి పరిస్థితే నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆఫీసులో కీలక పత్రాలు మాయం అయినట్లుగా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మాజీ మంత్రి ఆఫీసులోకి వెళ్లిన కొందరు సీసీ కెమేరాల్ని నిలిపేసి మరీ గందరగోళాన్ని క్రియేట్ చేయటం సంచలనంగా మారింది.

ఈ ప్రాంతంలోనే విద్యా శాఖకు చెందిన కొన్ని ఫైళ్లను ఒకరు దొంగచాటుగా తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకోవటం కలకలాన్ని రేపింది. ఈ రెండు ఉదంతాలు షాకింగ్ గా మరాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చెందిన ఛాంబర్ లో శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో కిటికీ గ్రిల్స్ తొలగించి.. కొందరు ఆఫీసులోకి ప్రవేశించటం.. అక్కడి నుంచి పత్రాలు.. కంప్యూటర్లోని హార్డ్ డిస్కులు తీసుకెళ్లిన వీడియోలు వైరల్ గా మారాయి.

అదే రోజురాత్రి అక్కడ వాచ్ మన్ గా పని చేస్తున్న లక్ష్మయ్య ఆఫీసు తాళాలు తీసి ఉండటాన్ని గమనించి.. అనుమానం వచ్చి చూడగా లోపల ఫైళ్లు.. కంప్యూటర్లు.. బీరువాలు చిందరవందరగా కనిపించటంతో అతడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్.. కంప్యూటర్ ఆపరేటర్ తో పాటు మరికొందరు ఎలాంటి అనుమతి లేకుండా ఆఫీసులోకి ప్రవేశించినట్లుగా లక్ష్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు సంచలనంగా మారాయి. మాజీ మంత్రుల పేషీలకు గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. పశుసంవర్థక శాఖలో పత్రాలు.. ఫైళ్లు మాయం కావటంపై వస్తున్న వార్తల్లో నిజం లేదని మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్ ఒకప్రకటనలో తెలిపారు. తొమ్మిది నెలల క్రితమే ఆ ఆఫీసును కొత్త సచివాలయానికి తరలించినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఫర్నీచర్.. ఇతరసామాగ్రిని జీఏడీకి అప్పగించే ప్రక్రియలో భాగంగా మాసబ్ ట్యాంక్ ఆఫీసుకు వెళ్లినట్లుగా వివరణ ఇస్తున్నారు. ఏమైనా ఈ ఉదంతంపై ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ చేయాలన్న మాట బలంగా వినిపిస్తోంది.