Begin typing your search above and press return to search.

వలసల రాష్ట్రం బిహార్‌లో ఉద్యోగాలన్నీ బిహారీలకేనట.. తేజస్వీ చోద్యం

గత ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పోటీ చేసిన నీతీశ్‌కుమార్‌ జేడీయూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

By:  Tupaki Desk   |   18 Jun 2025 9:44 AM IST
వలసల రాష్ట్రం బిహార్‌లో ఉద్యోగాలన్నీ బిహారీలకేనట.. తేజస్వీ చోద్యం
X

బిహార్‌ అంటే సంకుల సమరం.. అలాంటిచోట ఎన్నికలు మరింత రసకందాయం.. ఇప్పటికే సెప్టెంబరు-అక్టోబరులో ఎన్నికలు జరగాల్సిన బిహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాని నరేంద్రమోదీ తరచూ ఆ రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు. మరోవైపు బిహార్‌లో బీజేపీ పోటీ అంతా లాలూప్రసాద్‌ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్‌తోనే. ఈ పార్టీని లాలూ కుమారుడు తేజస్వీ నడుపుతున్నారు. గత ఎన్నికల్లో విజయం అంచుల వరకు తీసుకెళ్లారు. ఈసారి కూడా తేజస్వీ గట్టి పట్టుదలతో ఉన్నారు. విశ్లేషకులు మాత్రం బిహార్‌ ఫలితాలను ఊహించలేమని చెబుతున్నారు. చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

గత ఎన్నికల సమయంలో బీజేపీతో కలిసి పోటీ చేసిన నీతీశ్‌కుమార్‌ జేడీయూ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, నీతీశ్‌ బీజేపీకి హ్యాండిచ్చారు. 2022లో కాంగ్రెస్‌, ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని నెలకొల్పారు. మహా ఘట్‌బంధన్‌ దీనిపేరు. కానీ, 2023లో దానికి హ్యాండిచ్చి బీజేపీతో కలిశారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికలనూ కలిసే ఎదుర్కొన్నారు.

ఈసారి జరిగే ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్‌ కూటమికి గెలుపు చాలా కీలకం. ఎందుకంటే.. అది నీతీశ్‌ మీద ప్రతీకారం కాబట్టి. ఇప్పటికే కూటములు మార్చే పల్టూ రామ్‌గా నీతీశ్‌ పేరు స్థిరపడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ప్రత్యామ్నాయం తేజస్వీనే. వాస్తవానికి పదేళ్ల కిందటే తేజస్వీ పెద్ద నాయకుడిగా ఎదిగేలా కనిపించారు. బిహార్‌లో యువ నాయకుడిగా ఓ హవా సృష్టించారు. తేజస్వీలో లాలూను చూసుకున్నారు ప్రజలు. అయితే, ఆయన డిప్యూటీ సీఎం స్థాయి వరకే వెళ్లగలిగారు. ఇప్పుడు జీవితంలో అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొనబోతున్నారు.

ఎలాగైనా గెలవాలనే ఉత్సాహమో.. లేక అనుభవం లేకనో తేజస్వీ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవేమంటే.. బిహార్‌లో అధికారంలోకి వస్తే వంద శాతం నివాస చట్టం అమలు చేస్తామని ప్రకటించారు. ఉద్యోగాలన్నీ ఇక్కడి యువతకే ఇస్తామని చెప్పారు. ఈ మేరకు చట్టం చేస్తామని పేర్కొన్నారు. కాగా, దేశంలో ఇలాంటి విధానాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించిందని, సంస‍్థలు పెట్టుబడి పెట్టవని నెటిజన్లు సూచిస్తున్నారు.

వాస్తవానికి బిహారీలే ఉపాధి లేక సొంత రాష్ట్రం వీడుతుంటారు. దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్లి పొట్టపోసుకుంటూ ఉంటారు. కొవిడ్‌ సమయంలో తరలిపోయిన వలస కార్మికుల్లో బిహారీలే అధికం. పెద్దపెద్ద నగరాల్లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తుంటారు. అసలు బిహార్‌లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఉంటే వీరంతా ఎందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్తారనే ప్రశ్న ముఖ్యం. ఇతర రాష్ట్రాల నుంచి గతంలో బిహారీలను వెళ్లగొట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇక ముంబై స్థానికులకే అనే నినాదం తీసుకొచ్చినా అది చెల్లలేదు. ఇప్పుడు తేజస్వీ వాదన కూడా అంతేకానుంది. కాబట్టి ఎన్నికల సమయంలో చేసే వ్యాఖ్యలను ఒకసారి తరచి చూసుకోవడం ఉత్తమం.