Begin typing your search above and press return to search.

తీన్మార్ మల్లన్న.. తీన్ బార్ పార్టీ జంపింగ్

ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

By:  Tupaki Desk   |   8 Nov 2023 10:31 AM GMT
తీన్మార్ మల్లన్న.. తీన్ బార్ పార్టీ జంపింగ్
X

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. జర్నలిస్టుగా, అధికార పార్టీపై పాలనను ప్రశ్నించే వ్యక్తిగా అందరికీ సుపరిచితుడే. వర్తమాన రాజకీయాలపై పట్టున్న వ్యక్తి. రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్న నాయకుడు. ఇప్పుడీ నేత కాంగ్రెస్ లో చేరిపోయారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ తీన్మార్ మల్లన్న తీన్ బార్ (మూడో సారి) ఓ పార్టీలోకి వెళ్లడం గమనార్హం.

యూట్యూబ్ ఛానెల్లో రాజకీయాలపై విశ్లేషణలు చేస్తు, అధికార బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తీన్మార్ మల్లన్న ఫేమస్ అయ్యారు. మొదట్లో తాను ఏ పార్టీలోనూ చేరనని చెప్పారు. స్వతంత్రంగానే రెండు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలోనూ స్వతంత్రంగానే బరిలో దిగి పరాజయం పాలయ్యారు. ఇలా అయితే లాభం లేదనుకున్నారో ఏమో కానీ 2021లో ఢిల్లీ వెళ్లి మరీ బీజేపీలో చేరిపోయారు. కానీ ఆ పార్టీలో కొద్దిరోజులే ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయానని భావించి ఆయన బయటకు వచ్చినట్లు టాక్.

ఆ తర్వాత ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లి బయటకు వచ్చారు. బయటకు రాగానే సొంతంగా తెలంగాణ నిర్మాణ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేసుకున్నారు. మేడ్చల్లో మల్లారెడ్డిపై పోటీ చేయడమే కాదు ఆయన్ని ఓడిస్తానని కూడా పేర్కొన్నారు. కానీ కొత్త పార్టీ సంగతి గల్లంతైంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ తో సన్నిహితంగా మెలుగుతున్న మల్లన్న ఇప్పుడు హస్తం గూటికి చేరారు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉండటంతో ఆయన ఈ పార్టీలో చేరారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లు తెలిసింది.