Begin typing your search above and press return to search.

'కంచం పొత్తు, మంచం పొత్తు'... క్లారిటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న!

అవును... తన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న స్పందించారు.

By:  Tupaki Desk   |   13 July 2025 4:43 PM IST
కంచం పొత్తు, మంచం పొత్తు... క్లారిటీ ఇచ్చిన తీన్మార్ మల్లన్న!
X

తాజాగా ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బీఆరెస్స్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలువురు కార్యకర్తలు దాడికి దిగారు! కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో జరిగిన ఘటనపై మల్లన్న రియాక్ట్ అయ్యారు.

అవును... తన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిపై ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా... ఎమ్మెల్సీ కవిత, ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి తెగబడిందని ఆరోపించారు. 'కంచం పొత్తు, మంచం పొత్తు' వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చారు. తాజాగా హైదరాబాద్‌ లో మీడియాతో ఆయన మాట్లాడారు.

తన కార్యాలయంపై జరిగిన దాడిలో తన చేతికి గాయమైందని.. తన గన్‌ మెన్‌ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు కవిత అనుచరులు యత్నించారని.. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఇసుమంత కూడా తగ్గదని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.

ఇలాంటి పనులకు తాను భయపడనని.. ఈ విషయాన్ని రాసి పెట్టుకోవచ్చని.. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది అంటూ మల్లన్న మండిపడ్డారు. ఈ సందర్భంగా... కేసీఆర్‌, కేటీఆర్‌ లపై ఉన్న ఫ్రస్ట్రేషన్‌ తమపై చూపిస్తామంటే కుదరదని చెప్పిన మల్లన్న... ఇలాంటి దాడులతో మరింత దిగజారి చులకన కావడం తప్ప ఇంకేమీ ఉండదన్నారు.

ఈ నేపథ్యంలో కంచం పొత్తు, మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవడమని.. తాను ఆ ఉద్దేశ్యంతోనే అన్నానని.. కనీస అవగాహన లేకుండా కవిత కిరాయి రౌడీలను పంపించి దాడి చేయించారని అన్నారు. తాను ఒకవేళ తలదించుకోవాల్సి వస్తే అది బీసీ బిడ్డలవద్దే కానీ.. కల్వకుంట్ల దొరల కాళ్ల దగ్గర కాదని మల్లన్న వ్యాఖ్యానించారు.

అసలు.. బీసీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై తాము పోరాడుతుంటే మధ్యలో కవితకు ఎందుకు బాధ? అని ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న... ఉనికి కోసం అయితే కేసీఆర్‌ ను అడగాలని సూచించారు.