తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గన్ మెన్ కాల్పులు.. ఏం జరిగింది?
ఇటీవల కాలంలో ప్రత్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల సంస్కృతి పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.
By: Tupaki Desk | 13 July 2025 2:04 PM ISTఇటీవల కాలంలో ప్రత్యర్థుల ఇళ్లు, కార్యాలయాలపై దాడుల సంస్కృతి పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. బీఆరెస్స్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాడికి దిగారు! కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవును... ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. ఇందులో భాగంగా.. ఆయన కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్ మెన్ గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులను అదుపు చేశారు.
దాడి జరిగిన సమయంలో మల్లన్న ఆఫీసులోనే ఉన్నారు. ఈ సమయంలో కార్యాలయంలోని గదిలో ఉంచి మల్లన్నకు గన్ మెన్లు రక్షణ కల్పించారు. ఆ సమయంలో జాగృతి కార్యకర్తలు భారీగా ఆఫీసులోకి చొచ్చుకురావటంతో పరిస్థితి అదుపుతప్పిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లన్న గన్ మెన్ ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారని తెలుస్తోంది.
ఈ సమయంలో ఆఫీసులోని అద్దాలు ధ్వసం కావటంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తొంది. ఈ సమయంలో ఎమ్మెల్సీ మల్లన్న చేతికి కూడా స్వల్పంగా గాయమైందని సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. మాజీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు.
కాగా... ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం బీసీ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే... కవిత చర్యలను తప్పుబడుతూ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ లో పలు అనుచిత వ్యాఖ్యలు చేయడమే ఈ వ్యాఖ్యలే జాగృతి కార్యకర్తల ఆగ్రహానికి కారణమయ్యాయని తెలుస్తోంది!
