Begin typing your search above and press return to search.

తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీతో పెను సంచలనం

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశారు.

By:  Tupaki Desk   |   14 July 2025 11:45 AM IST
తీన్మార్ మల్లన్న.. కొత్త పార్టీతో పెను సంచలనం
X

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ప్రముఖ జర్నలిస్టు, సామాజిక కార్యకర్తగా పేరుగాంచిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటన చేశారు. బీసీ సామాజిక వర్గానికి రాజకీయ రాజ్యాధికారాన్ని అందించాలన్న లక్ష్యంతోనే ఈ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు.

- బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం

తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో మల్లన్న మాట్లాడుతూ “రాష్ట్రంలో బీసీలు ఎన్నో దశాబ్దాలుగా చిన్నచూపుకు గురవుతున్నారు. కేవలం రిజర్వేషన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం సరిపోదు. వారికి నేరుగా పాలనా బాధ్యతలు రావాలి. బీసీలు ఐక్యత చూపిస్తే రాష్ట్ర రాజకీయ దిశను మలిచే శక్తిగా మారవచ్చు,” అని పేర్కొన్నారు.

-పార్టీ పేరు మాత్రం సస్పెన్స్‌

కొత్త పార్టీ స్థాపనపై స్పష్టత ఇచ్చినప్పటికీ, దాని పేరు, ప్రారంభ తేదీ వంటి కీలక విషయాలను మాత్రం మల్లన్న ఇంకా వెల్లడించలేదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి బీసీల మద్దతుతో రాజకీయంగా ప్రభావం చూపించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

-కవిత వ్యాఖ్యలపై తీవ్ర స్పందన

తాజా పరిణామాలకు కారణంగా భావించదగిన అంశం బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు. బీసీ రిజర్వేషన్లపై ఆమె చేసిన ప్రకటనలపై మల్లన్న తీవ్ర స్థాయిలో స్పందించడంతో పాటు, ఆమెను రాజకీయంగా నిలదీశారు. దీనికితోడు మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి దిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

-గతంలోనూ రాజకీయ పార్టీ ప్రయత్నం

ఇది మల్లన్న తొలిసారి రాజకీయ పార్టీ స్థాపన ప్రయత్నం కాదు. 2023 ఎన్నికలకు ముందు కూడా తెలంగాణ నిర్మాణ పార్టీ (TNP) పేరుతో ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించినట్లు ప్రకటించారు. యువత, బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా TNP ను తీర్చిదిద్దుతామని చెప్పినా అది కాగితాలకే పరిమితమైంది. ఆ పార్టీ ద్వారా కుటుంబ పాలనలకు చెక్ పెడతామని ప్రకటించినప్పటికీ, మల్లన్న చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

- పార్టీలో అంతరాయం.. దూరమైన మల్లన్న

కాంగ్రెస్ తరఫున మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందిన తర్వాత ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా, కుల గణన అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు రెడ్డి వర్గ ప్రయోజనాల కోసమే దీనిని తీసుకొచ్చారన్న ఆరోపణలు పార్టీలో కలకలం రేపాయి. దీంతో సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేయడంతో మల్లన్నను ప్రక్కన పెట్టారు.

-తీరని అసంతృప్తి.. కొత్త దిశ?

కాంగ్రెస్‌లో పూర్తిస్థాయి సామాజిక న్యాయం లేకపోవడమే తన నిర్ణయానికి ప్రధాన కారణమని మల్లన్న పేర్కొంటున్నారు. బీసీ వర్గాన్ని ఐక్యంగా చేసి, రాజకీయంగా సుస్థిరంగా చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తీన్మార్ మల్లన్న పార్టీ ప్రారంభం అనేది తెలంగాణ రాజకీయాల్లో కొత్త అడుగు. ఇది కేవలం మరో ప్రచార యత్నంగా మిగిలిపోతుందా? లేక నిజంగా బీసీ వర్గానికి కొత్త దిశ చూపిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానం వచ్చే రోజుల్లో తేలనుంది. అయినా.. మల్లన్న తాజా ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు.