Begin typing your search above and press return to search.

కన్నవారు దూరమై.. కలత చెందిన బాలిక ఘోర నిర్ణయం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన బాలిక (16) తల్లితండ్రులు చిన్నప్పుడే విడిపోయారు.

By:  Tupaki Desk   |   17 April 2025 2:06 PM IST
16-Year-Old Girl Ends Life Wishing Her Estranged Parents
X

సెల్ ఫోన్ వాడొద్దన్నారని.. సరిగ్గా చదవడం లేదని మందలించారాని.. స్నేహితులతో ఎక్కువగా తిరగొద్దన్నారని.. ఆన్ లైన్ గేమ్స్ ఆడొద్దన్నారని.. రకరకాల కారణాలతో పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు తరచూ వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే! అయితే.. తాజాగా కన్నవారు కలిసి ఉండాలని ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన తెరపైకి వచ్చింది.

అవును... చిన్నప్పుడే కన్నవారు దూరమై అమ్మమ్మగారింట్లో ఉంటున్న బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది! అలా చిన్నప్పటి నుంచీ కన్నవారు దూరమై కలత చెందిన ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. సూసైడ్ నోట్ రాసి, ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జంగారెడ్డి గూడెం పట్టణానికి చెందిన బాలిక (16) తల్లితండ్రులు చిన్నప్పుడే విడిపోయారు. దీంతో.. స్థానిక రోటరీ కమ్యునిటీ హాలు రోడ్డులోని ఆమె అమ్మమ్మవద్దే ఉంటుంది. ఈ క్రమంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితల్లో ఓ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యింది.

ఈ నేపథ్యంలో బుధవారం ఎవరూ ఇంట్లో లేని సమయంలో దారుణ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సందర్భంగా... తాను చనిపోయిన తర్వాతైనా తన తల్లితండ్రులు కలిసి ఉండాలని.. తన చావుకు ఎవరూ కారణం కాదని.. జీవితంపై విరక్తి చెంది ఈ పని చేసినట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది.

ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం, బాలిక మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసుకున్నాట్లు పోలీసులు వెల్లడించారు. కాగా... ఆ బాలిక తల్లితండ్రులు ఆమె మూడో ఏట నుంచే రాజమండ్రిలో వేరు వేరుగా ఉంటున్నారు.