Begin typing your search above and press return to search.

అమ్మాయి అబ్బాయి ముద్దు ఇన్ స్టాలో వైరల్.. తర్వాత తన్నుకున్నారిలా..

వైరల్‌ వీడియో చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పరస్పరం దూషణలు, ఆరోపణలు మొదలయ్యాయి.

By:  Tupaki Desk   |   5 July 2025 9:50 PM IST
అమ్మాయి అబ్బాయి ముద్దు ఇన్ స్టాలో వైరల్.. తర్వాత తన్నుకున్నారిలా..
X

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రబలంగా పెరిగింది. ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్‌ఫోన్, అందులో అపరిమితమైన డేటా, పైగా విపరీతమైన ఆసక్తి ఈ సామాజిక మాధ్యమాలపై. అయితే ఈ మాధ్యమాలు జీవితాన్ని మార్చే శక్తితో ఉండే సాధనాలే అయినా.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే జీవితాన్నే నాశనం చేసే ఆయుధాలుగా మారిపోతున్నాయి.

ఇలాంటి సంఘటనే ఇటీవల తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కొత్తవాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లు ఒక బాలిక, బాలుడు ప్రేమలో పడినట్లు సమాచారం. వారిద్దరూ స్థానికంగా చదువుకుంటున్నారు. సోషల్ మీడియా పరిచయంతో వారిద్దరూ ప్రేమలో మునిగిపోయి, ఇటీవల ఏకాంతంలో ఒకరినొకరు ముద్దుపెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఆ దృశ్యాన్ని వీడియోగా తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియో చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. పరస్పరం దూషణలు, ఆరోపణలు మొదలయ్యాయి. చివరకు ఆగ్రహం దారుణ స్థాయికి చేరి.. వీరు రోడ్డుమీదికి వచ్చారు. రెండు కుటుంబాలు ఒకరిపై మరొకరిపై దాడికి దిగాయి. ఒక చిన్న వీడియో రెండు కుటుంబాల మధ్య చిచ్చుపెట్టింది. విభేదాల ముళ్ళు నాటింది. రెండు కుటుంబాలు రోడ్డు మీదకు వచ్చి కొట్టుకున్నాయి. కొట్లాటలు జరగడంతో పరిసర ప్రాంతం యుద్ధ భూమిగా మారిపోయింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాకుండా సమాజం మొత్తంలో చర్చనీయాంశంగా మారింది. మైనర్లు ప్రేమలో పడటం, దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, కుటుంబాలు దానివల్ల అగౌరవానికి గురవడం… ఇవన్నీ మన నేటి సమాజంలో మెల్లగా పెరుగుతున్న అపాయాలను సూచిస్తున్నాయి.

సామాజిక మాధ్యమాల బానిసత్వం

సామాజిక మాధ్యమాలు జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా, అవగాహన పెంచే మాధ్యమాలు కావాలి. కానీ మైనర్లు, యువత ఈ మాధ్యమాలను సరిగ్గా వినియోగించకపోతే, చిన్న తప్పు జీవితాన్ని మలినంగా మలుస్తుంది. ముద్దు పెట్టుకోవడం వంటి వ్యక్తిగత విషయాలను వీడియో తీసి వైరల్ చేయడం ఎంత ప్రమాదకరం అనే విషయాన్ని ఈ సంఘటన తేటతెల్లం చేసింది.

పెద్దల బాధ్యతేంటీ?

ఈ సంఘటనల మధ్య నిలబడాల్సింది పెద్దల బాధ్యత. పిల్లల చేతిలో ఫోన్ ఇచ్చే ముందు, దాని ఉపయోగం, అపాయాలు గురించి అవగాహన కల్పించాలి. ప్రేమ గురించి, శారీరక బంధాల గురించి, సామాజిక బాధ్యతల గురించి నిండైన చర్చ అవసరం. లేదంటే, తాము చేసిన చిన్న పొరపాటు కారణంగా జీవితమే తారుమారవుతుంది.

ఒక చిన్న ముద్దు, ఒక చిన్న వీడియో.. రెండు కుటుంబాలను రోడ్డుమీదికి తెచ్చింది. మైనర్ల చేతిలో ఫోన్ ఎంత ప్రమాదకరం కావొచ్చో, ఈ సంఘటన అందరికీ గుణపాఠం కావాలి. ప్రేమ అనేది బాధ్యతగా మారాలి. సోషల్ మీడియా వినియోగం ఒక బాధ్యతగా ఉండాలి. లేదంటే ఈ కథలు ఒక్కొక్కటిగా ‘వైరల్’ అవుతూనే ఉంటాయి… కానీ జీవితాల్ని విషాదాంతాలవైపు తీసుకెళ్తాయి.