Begin typing your search above and press return to search.

ఆ 'తీగ‌' ఎవ‌రికి త‌గులుకునేనో?!

దీంతో త‌మకు అనుకూలంగా ఉండే నాయ‌కుల కోసం ఎదురు చూస్తుంటారు. దీంతో ప్ర‌భావం చూపించ‌గ‌లిగే నాయ‌కులకు ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగింది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:30 PM GMT
ఆ తీగ‌ ఎవ‌రికి త‌గులుకునేనో?!
X

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యం. ఎవ‌రు మ‌ద్ద‌తిచ్చినా.. ఎవ‌రు త‌మ‌కు అనుకూలంగా మాట్లాడినా.. త‌మ‌కు ఎంతో కొంత ప్ల‌స్ అవుతుంద‌ని నాయ‌కులు ఆశ‌లు పెట్టుకుంటారు. ఇక‌, స్థానికంగాబ‌లం ఉన్న నాయ‌కు లు, సామాజిక వ‌ర్గం ప‌రంగా ప్ర‌భావితం చూప‌గ‌ల నాయ‌కులు ఉంటే ఇంకా మంచిద‌ని భావిస్తారు. దీంతో త‌మకు అనుకూలంగా ఉండే నాయ‌కుల కోసం ఎదురు చూస్తుంటారు. దీంతో ప్ర‌భావం చూపించ‌గ‌లిగే నాయ‌కులకు ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగింది.

ఇలాంటి నాయ‌కుల్లో మాజీ ఎమ్మెల్యే తీగ‌ల కృష్ణారెడ్డి ముందున్నారు. రంగారెడ్డి జిల్లాలో టీకేఆర్ విద్యా సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసి.. త‌ర్వాత టీడీపీలోకి వ‌చ్చిన తీగ‌ల కృష్ణారెడ్డి హైద‌రాబాద్ మేయ‌ర్‌గా ప‌నిచేసిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. 2014 ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. త‌ర్వాత తీగ‌ల బీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేశారు.

కానీ, ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక‌, ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న స‌బిత‌కు కేసీఆర్ కండువా క‌ప్ప‌డం.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో సీటు రాద‌ని గుర్తించ‌డంతో తీగ‌ల మ‌రోసారి పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ, ఇక్క‌డ కూడా ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. అయితే.. ఎన్నిక‌ల‌ను ప్ర‌భావం చేయ‌గ‌ల నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. కానీ, మ‌రోవైపు.. ఆయ‌న అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. దీంతో కాంగ్రెస్‌లో ఉన్నా.. అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక‌, కాంగ్రెస్ మ‌హేశ్వ‌రం టికెట్‌ను కిచ్చ‌న్న‌గారి ల‌క్ష్మారెడ్డికి కేటాయించింది. దీంతో ఆర్థికంగా బ‌లంగా ఉండ‌డం.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో మంచి పేరున్న నేప‌థ్యంలో తీగ‌ల కృష్ణారెడ్డి మ‌ద్ద‌తు కోసం.. అన్ని పార్టీల నాయ‌కులు ఇప్పుడు అర్రులు చాస్తున్నార‌నే చెప్పాలి. పైగా కిచ్చ‌న్న‌తో ఈయ‌న‌కు ఉన్న విభేదాలు.. మ‌రోవైపు స‌బిత‌తో ఉన్న అంత‌ర్గ‌త రాజ‌కీయ పోరు వంటివి తీసుకుంటే.. తీగ‌ల మ‌ద్దతు ఎవ‌రికి ఉంటుంద‌నేది ఆస‌క్తిగా మారింది. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆయ‌న ఎటు వైపు మొగ్గు చూపుతారో చూడాలి.