Begin typing your search above and press return to search.

జీవితమేం కాదు పూల పాన్పు.. అంబానీ కంట కన్నీరు

రాధికా మర్చంట్ తో వివాహం కుదరగా.. ప్రస్తుతం ప్రి వెడ్డింగ్ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 March 2024 11:20 AM GMT
జీవితమేం కాదు పూల పాన్పు.. అంబానీ కంట కన్నీరు
X

ఆయన దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడు.. ప్రపంచంలోనే టాప్ కుబేరుల్లో ఒకరు.. మొత్తం ఆస్తుల విలువ రూ.15 లక్షల కోట్లు ఉంటుందేమో..? కోరుకున్నది కాళ్ల దగ్గరకు తెచ్చుకోగల సామర్థ్యం.. అనుకున్నది నెరవేర్చుకోగల సత్తా.. అంతటి వ్యక్తికీ కష్టాలు ఉంటాయా? ఎందుకుండవు..? ఈ ఉదాహరణను చూస్తే తెలుస్తోంది. ముఖేష్ అంబానీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి. భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన సంస్థకు అధినేత. తండ్రి వ్యాపార వారసత్వాన్ని వేరొక స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఆయనది. ఇక ముఖేష్ అంబానీ-నీతా అంబానీ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో అనంత్ అంబానీ చిన్నవాడు. ఇతడి కంటే ముందు ఆకాశ్, ఇషా జన్మించారు (వీరిద్దరూ కవలలు). ఈ అన్నాచెల్లెళ్లకు ఇప్పటికే వివాహాలు అయ్యాయి. మిగిలింది అనంత్. రాధికా మర్చంట్ తో వివాహం కుదరగా.. ప్రస్తుతం ప్రి వెడ్డింగ్ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతున్నాయి.

జామ్ నగర్ లో జామ్ జామ్ గా

క్రీడా, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు ఆహ్వానాలు.. ఏకంగా విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్, స్థానిక ప్రజలకు స్వయంగా వడ్డింపు.. ఓ ప్రపంచమే కదిలివచ్చిందా? అనేంతగా జామ్ నగర్ లో ఆనంత్, రాధికా మర్చంట్ ప్రి వెడ్డింగ్ వేడుకలు సాగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు శుక్రవారం సాయంత్రం మొదలయ్యాయి. పాప్‌ సింగర్‌ రిహన్నాతో పాటు పలువురి ప్రదర్శనలు కట్టిపడేశాయి. వేడుకల తొలి రోజే.. అనంత్‌ మాట్లాడాడు.

ఒకప్పటి భారీ కాయం..

అనంత్ కొన్నేళ్ల కిందటి వరకు తీవ్రమైన ఊబకాయంతో ఉండేవాడు. ఐపీఎల్ మ్యాచ్ లకు వచ్చిన అతడిని అందరూ కాస్త భిన్నంగా చూసేవారు. అనారోగ్య సమస్యల కారణంగా అనంత్ ఊబకాయం బారినపడినట్లు తెలుస్తోంది. అయితే, తీవ్రంగా శ్రమించి బరువు తగ్గి సాధారణ యువకుడిగా మారాడు. దీనివెనుక ఉన్నది మాత్రం అతడి తల్లి నీతా అంబానీనే. దీనినే ప్రి వెడ్డింగ్ వేడుకల సమయంలో తెలియజేశాడు. అందరూ అనుకుంటున్నట్లుగా లక్షల కోట్ల అధిపతి అయినప్పటికీ తన జీవితం ఏమీ పూలపాన్పు కాదని.. ముళ్ల బాధను అనుభవించానని చెప్పాడు. ఆ క్రమంలో చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యల ఎదుర్కొన్నానని తెలిపాడు. ఆ బాధను మర్చిపోయేలా నా తల్లిదండ్రులు అండగా నిలిచారన్నాడు. అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారని కొనియాడాడు. తన సంతోషం కోసం అమ్మ ఎంతో చేశారని.. రోజుకు 18-19 గంటలు కష్టపడ్డారని చెప్పాడు. ఈ వేడుకను అత్యంత ప్రత్యేకంగా నిలిపేందుకు కుటుంబం అంతా రెండు నెలలుగా రోజుకు 3 గంటలే నిద్రపోయిందన్న సంగతినీ తెలిపాడు.

అనంత్ ఆరోగ్య సమస్యల గురించి చెబుతుండగా తండ్రి ముకేశ్‌ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, తల్లి నీతా అంబానీతో కలిసి అనంత్ ఐపీఎల్ మ్యాచ్ లను వీక్షిస్తుంటారు. సొంత ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వ్యవహారాల్లో అనంత్ పాత్ర కీలకం.