Begin typing your search above and press return to search.

అమరావతి రాజధాని ఇష్యూ...వైసీపీ టీడీపీ వ్యూహాత్మకమేనా...!?

ఇప్పటికి సరిగ్గా నాలుగేళ్ల క్రితం నుంచి చూస్తే ఏపీలో ఒక బర్నింగ్ టాపిక్ గా అమరావతి రాజధాని ఇష్యూ ఉంది. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రస్తావనను జగన్ అసెంబ్లీలో చేశారు.

By:  Tupaki Desk   |   6 Jan 2024 3:30 AM GMT
అమరావతి రాజధాని ఇష్యూ...వైసీపీ టీడీపీ వ్యూహాత్మకమేనా...!?
X

ఇప్పటికి సరిగ్గా నాలుగేళ్ల క్రితం నుంచి చూస్తే ఏపీలో ఒక బర్నింగ్ టాపిక్ గా అమరావతి రాజధాని ఇష్యూ ఉంది. 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రస్తావనను జగన్ అసెంబ్లీలో చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ అమరావతి మీద తన అభిప్రాయాన్ని అలా కుండబద్ధలు కొట్టారు. మూడు రాజధానులు అంటూ కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు.

అది ఒక బ్రహ్మపదార్ధంగా తొలి రోజుల్లో ఉంది. దాంతో బాగుంది అన్న వారు అన్నారు. లేని వారు లేదు. ఇక అమరావతిని మూడు ముక్కలు చేస్తామంటే టీడీపీ పూర్తిగా వ్యతిరేకించింది. దాంతో మూడు రాజధానుల మీద వైసీపీ దూకుడు చేసింది. చట్టాన్ని చేసి మరీ ముందుకు సాగింది. అది కాస్తా హై కోర్టుకు వెళ్లి అక్కడ న్యాయ సమీక్షకు రాగానే మూడు రాజధానుల చట్టాన్ని జగన్ సర్కార్ ఉపసంహరించుకుంది.

సమగ్రమైన చట్టంతో మళ్ళీ అసెంబ్లీ ముందుకు వస్తామని నాడు ముఖ్యమంత్రి జగన్ చెప్పినా అది నెరవేరలేదు. ఈలోగా హైకోర్టు అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంటూ తీర్పు ఇచ్చింది. దాని మీద 2022లో సుప్రీం కోర్టులో జగన్ ప్రభుత్వం అప్పీల్ కి వెళ్ళింది. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మరీ న్యాయ పోరాటం మొదలెట్టింది. అయితే అది కాస్తా వాయిదాల మీద వాయిదాలు పడుతూ 2024 ఏప్రిల్ నాటికి లేటెస్ట్ వాయిదాగా మారింది.

దీన్ని బట్టి చూస్తే ఏపీలో ఎన్నికలే ముందు వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఏపీలో మార్చి చివరలో కానీ ఏప్రిల్ మొదట్లో కానీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఆ విధంగా చూస్తే అత్యున్నత న్యాయ స్థానం తీర్పు కంటే ముందే ప్రజా న్యాయ స్థానంలో తీర్పు వస్తుంది అన్న మాట.

ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజలు అమరావతినే ఏకైక రాజధానిగా కోరుకుంటారా లేక మూడు రాజధానులకు మద్దతు ఇస్తారా అన్నది కూడా జనం ఇచ్చే తీర్పు ద్వారా తెలిసిపోఉంది. ఇదిలా ఉంటే ఇపుడు ఏపీలో చూస్తే అధికార వైసీపీ కానీ విపక్ష తెలుగుదేశం కానీ అమరావతి రాజధాని ఇష్యూని పూర్తిగా టచ్ చేయడం లేదు అని అంటున్నారు.

వైసీపీ మూడు రాజధానులు అంటూ దూకుడు చేసినా ఏమీ చేయలేకపోయింది. కనీసం ముచ్చటకు అయినా జగన్ విశాఖ వెళ్ళి క్యాంప్ ఆఫీస్ ద్వారా పాలన చేయలేకపోయారు. ఇక కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పినా అక్కడకు హైకోర్టు తరలించలేకపోయారు. ఈ నేపధ్యంలో వైసీపీ మూడు రాజధానుల ఇష్యూని ఎన్నికల అజెండాలో ప్రధాన అంశంగా చేర్చి జనం ముందుకు వెళ్తుందా అన్న చర్చ కూడా ఉంది.

అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా అమరావతి రాజధాని వర్సెస్ మూడు రాజధానుల ఇష్యూని పూర్తి స్థాయిలో ముందుకు తేలేకపోవచ్చు అని అంటున్నారు. దానికి కారణం ఉత్తరాంధ్రా రాయలసీమ ప్రజలలో ఎక్కడైనా లోకల్ సెంటిమెంట్ ఉంటే అది నెగిటివ్ అవుతుంది అన్న ఆలోచన ఉండడమే అంటున్నారు.

అంటే వైసీపీకి క్రిష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ఓట్లు కావాలి. అలాగే టీడీపీ మిగిలిన రెండు రీజియన్స్ లో పట్టు కావాలి. అందువల్ల ఈ ఇష్యూని వ్యూహాత్మకంగా ముందుకు తేకుండా మిగిలిన అంశాలతోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది అని అంటున్నారు.

వైసీపీ విషయమే తీసుకుంటే సామాజిక న్యాయం పేరుతో ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారికే ఎక్కువ సీట్లు ఇవ్వడం ద్వారా సోషల్ ఇంజనీరింగ్ నే నమ్ముకుని రెండవ సారి పవర్ లోకి రావాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇక చంద్రబాబు విషయమే తీసుకుంటే సంక్షేమ పధకాలు రెట్టింపు ఇస్తామని చెప్పడం అభివృద్ధిని కూడా అజెండాగా చేసుకుని జనంలోకి వెళ్ళడం చేస్తారు అని అంటున్నారు మొత్తానికి అమరావతి ఇష్యూ కనుక ఎన్నికల్లో ప్రధాన అజెండా కాకపోతే ఎన్నికల తరువాత కూడా సుప్రీం కోర్టు తీర్పు కోసం వేచి చూడడమే అవుతుంది. అపుడు కోర్టు ఇచ్చే తీర్పునే కొత్త ప్రభుత్వం ఏదైనా అమలు చేసి తీరాల్సి ఉంటుంది అని అంటున్నారు.